తెలంగాణ జిల్లా పరిషత్తులు: కుటుంబాల కోటలు

By narsimha lodeFirst Published Jun 6, 2019, 11:43 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో  టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు చెందిన కుటుంబసభ్యులు స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాల్లో 
విజయం సాధించారు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో  టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు చెందిన కుటుంబసభ్యులు స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాల్లో 
విజయం సాధించారు. ఈ కారణంగానే రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొనే చాన్స్ ఉంది.

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత  వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ ఛైర్మెన్‌గా  బాధ్యతలుగా స్వీకరించే అవకాశం ఉంది.పట్నం మహేందర్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో కూడ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్‌గా పట్నం సునీత పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు పట్నం మహేందర్ రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్‌‌లో చేరారు.

గత ఏడాది డిసెంబర్ 7 తేదీన జరిగిన ఎన్నికల్లో  తాండూరు నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డి విజయం సాధించారు.

గత ఎన్నికల్లో కొడంగల్‌ అసెంబ్లీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనిత రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం లేకపోలేదు.

భూపాలపల్లి ఎమ్మెల్యే  గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. గండ్ర వెంకటరమణరెడ్డి సతీమణి గండ్ర జ్యోతి వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించే చాన్స్‌ ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తనయుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మెన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

నాగర్‌కర్నూల్ ఎంపీ పి. రాములు తనయుడు పి. భరత్ నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మెన్‌గా బాధ్యతలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనయుడు శరత్ చంద్రారెడ్డి మేడ్చల్ జిల్లా  పరిషత్ చైర్మెన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భార్య  భాగ్యలక్ష్మి మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మెన్ బాధ్యతలను అనిల్ జాదవ్‌కు టీఆర్ఎస్‌  కట్టబెట్టే చాన్స్ ఉంది.అనిల్ జాదవ్ బోథ్ నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఆ తర్వాత అనిల్ జాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు.

మాజీ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పుట్ట మధు, స్వర్ణ సుధాకర్ రెడ్డి, కనకయ్యలు కూడ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌లుగా బాధ్యతలు స్వీకరించే చాన్స్ ఉంది. కోవ లక్ష్మిని ఆసిఫాబాద్‌కు, పెద్దపల్లిజిల్లాకు పుట్టమదు, మహబూబ్‌నగర్‌ జిల్లాకు స్వర్ణ సుధాకర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కె.కనకయ్య , కామారెడ్డి జిల్లాకు శోభలు జిల్లా పరిషత్‌ చైర్మెన్లుగా బాధ్యతలు స్వీకరించే చాన్స్‌ ఉంది.
 

click me!