దుబ్బాక: కేసీఆర్ కు విజయశాంతి హెచ్చరిక, అదే నిజమైంది

By telugu teamFirst Published Nov 10, 2020, 4:34 PM IST
Highlights

దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో కాంగ్రెసు నేత, సినీ నటి విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ కు చేసిన హెచ్చరికనే నిజమైంది. ఎవరు తీసిన గోతిలో వారే పడుతారని ఆమె వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి చెప్పిన మాట నిజమని తేలింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఇటీవల ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఎవరు తీసిన గోతిలో వారే పడుతారని ఆమె అన్నారు. 

కాంగ్రెసును బలహీనపరచడానికి కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, భయపెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని, దీంతో మరో జాతీయ పార్టీ అయిన బిజెపి తెలంగాణలో బలపడిందని, కేసీఆర్ కు సవాల్ విసిరే స్థాయికి ఎదిగిందని ఆమె అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి చూస్తే విజయశాంతి అంచనా నిజమని తేలింది. 

కాంగ్రెసు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే నిజమైంది. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెసు మూడో స్థానానికి పరిమితమైంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి తమ పార్టీలో చేరిన చేరుకు శ్రీనివాస రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 

బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మధ్య మాత్రమే పోరు జరిగింది. ఈ హోరాహోరీ పోరులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 

ఈ స్థితిలో విజయశాంతి కాంగ్రెసు భవిష్యత్తుపై కూడా సరైన అంచనాకే వచ్చినట్లు కనిపిస్తున్నారు. విజయశాంతి త్వరలో బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెతో భేటీ అయ్యారు. 

click me!