దుబ్బాకలో టీఆర్ఎస్ కు షాక్: దామోదరతో శ్రీనివాస రెడ్డి రహస్య మంతనాలు

By telugu teamFirst Published Oct 5, 2020, 11:50 AM IST
Highlights

తెలంగాణలోని దుబ్బాక శాసనసభా నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస రెడ్డి కాంగ్రెసు నేత దామోదర రాజనర్సింహతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి సతీమణి సుజాతను పోటీకి దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దీంతో దుబ్బాకలో అసమ్మతి చెలరేగుతోంది. 

సీటును ఆశిస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. తాజాగా ఆయన కాంగ్రెసు నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ఆయన రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దుబ్బాక అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తే పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెరుకు శ్రీనివాస్ రెడ్డి దామోదరతో చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: టీఆర్ఎస్ కు దుబ్బాక తలనొప్పి: చిచ్చు పెడుతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చెరుకు శ్రీనివాస రెడ్డి దివంగత నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు. పార్టీలోకి వచ్చినప్పుడు చెరుకు ముత్యంరెడ్డి కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇస్తామని టీఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చింది. దాంతో తనకు దుబ్బాక టికెట్ ఇవ్వాలని చెరుకు శ్రీనివాస రెడ్డి పట్టబడుతున్నారు.

అయితే, చెరుకు శ్రీనివాస రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, రఘునందన్ రావును పోటీకి దించాలని బిజెపి నిర్ణయం తీసుకుందని సమాచారం.

Also Read: దుబ్బాక బై పోల్: చీరలు పంచేస్తున్నారు... బీజేపీపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

కాంగ్రెసు కూడా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని దుబ్బాక నుంచి పోటీకి దించాలని ఆలోచిస్తోంది. తాజాగా, శ్రీనివాస రెడ్డి మంతనాలతో పరిస్థితి మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కూడా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు.

click me!