టీఆర్ఎస్ కు దుబ్బాక తలనొప్పి: చిచ్చు పెడుతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

By telugu teamFirst Published Oct 1, 2020, 8:04 AM IST
Highlights

దుబ్బాక టీఆర్ఎస్ లో చెరుకు శ్రీనివాస రెడ్డి చిచ్చు పెడుతున్నారు. సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాతను పోటీకి దించితే చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహకరిస్తారా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

హైదరాబాద్: దివంగత నేత సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాతను దుబ్బాకలో పోటీకి దించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దాదాపుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక టీఆర్ఎస్ లో చిచ్చు రేగుతోంది. దుబ్బాక టికెట్ తనకు ఇవ్వాలని మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసేందుకు ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఈ స్థితిలో సుజాతకు టికెట్ ఇస్తే శ్రీనివాస రెడ్డి సహకరిస్తారా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీనివాస రెడ్డిని బుజ్జగించేందుకు టీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అందుకు శ్రీనివాస రెడ్డి ససేమిరా అంటున్నట్లు సమాచారం.

తనకు టికెట్ లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలా, బిజెపి అభ్యర్థిగా పోటీ చేయాలా అనే ఆలోచనలో కూడా శ్రీనివాస రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. పోటీ చేయడం మాత్రం ఖాయమనే పద్దతిలో ఆయన వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. 

అసమ్మతితో ఉడికిపోతున్న శ్రీనివాస రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. కొంత మంది బిజెపి నేతలు ఆయనతో మాట్లాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన రఘునందన్ రావుకు బిజెపి మరో ఆఫర్ ఇచ్చి, శ్రీనివాస రెడ్డిని బరిలోకి దింపాలని చూస్తోంది.

కాగా, పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. ఆయన దుబ్బాక నియోజకవర్గంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హరీష్ రావుకు టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుంది. దాంతో ఆయన టీఆర్ఎస్ కు అనుకూలంగా పరిస్థితిని మారుస్తారని అంటున్నారు.

click me!