
డేటింగ్ యాప్‌ల ద్వారా మోసపోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. తాజాగా డేటింగ్ యాప్ మోజులో పడి ఓ డాక్టర్ కోటిన్నర రూపాయలు పోగొట్టుకున్నాడు. అది కూడా మూడు సార్లు కావడం గమనార్హం. ఆ డాక్టర్ ప్రవర్తన చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనపై డాక్టర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత డాక్టర్ సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి అని.. కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లకు కూడా ఎంపికయ్యాడని తెలస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడని సమాచారం.
అయితే కొన్నేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్‌లో అడుగుపెట్టాడు. అక్కడ ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయగా.. అవతలి నుంచి అమ్మాయిలు మాట్లాడారు. పక్కా ప్లాన్‌తో డాక్టర్‌ను వారిని ఉచ్చులో పడేశారు. అతనితో చాటింగ్ చేస్తూ 41 లక్షల రూపాయలు కాజేశారు. ఈ విషయం తెలిసిన డాక్టర్ కుటుంబం రెండేళ్ల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే డేటింగ్ యాప్‌కు అలవాటు పడిపోయిన డాక్టర్.. రెండు నెలల తర్వాత మరోసారి అందులోకి అడుగుపెట్టాడు. ఇలా చాటింగ్, వీడియో చాటింగ్ చేస్తూ దాదాపు 30 లక్షల రూపాయలు పోగొట్టాడు. అయితే దీనిని గుర్తించిన డాక్టర్ కుటుంబ సభ్యులు బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించారు. ఇందుకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ తాను దాచుకున్న మొత్తంతో పాటు.. అప్పులు చేసి మరి ఖర్చు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రెండు సార్లు అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి ఖాతాలో రూ. 18 లక్షలు పడినట్టుగా ఆధారాలు సేకరించారు. నేరం అంగీకరించిన నిందితుడు కొంత డబ్బు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అయితే కొన్ని రోజులకు డాక్టర్ అడ్డం తిరిగాడు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులపై తనదైన శైలిలో వేధింపులకు పాల్పడ్డాడు. అతడు ఇచ్చే డబ్బు కూడా తనకు వద్దని.. తనను మోసం చేసింది అతడు కాదని చెప్పుకొచ్చాడు.
అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి ఆధారాల ప్రకారం అతడిని అరెస్ట్ చేశామని.. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. అయిన కూడా డాక్టర్ వినపించుకోలేదు. చివరకు లోక్ అదాలత్‌లో కేసు రాజీ కుదుర్చుకున్నాడు. మరోమారు అతనికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్‌లు వచ్చాయి. యువతులు మాట్లాడటంతో.. మరోసారి పలు దఫాలు రూ. 80 లక్షల వరకు చెల్లింపులు చేశాడు. చివరకు ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థాయికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ ఇలా ఎందుకు చేస్తున్నాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడటంతోనే డాక్టర్ ఈ విధంగా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.