మంచిర్యాలలో శిశువుల తారుమారు: డీఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా పేరేంట్స్ కి చిన్నారుల అప్పగింత

By narsimha lode  |  First Published Jan 3, 2023, 3:46 PM IST


 మంచిర్యాల ఆసుపత్రిలో  డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా  చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు వైద్యులు. గత నెలలో  మగపిల్లాడి విషయంలో ఇరు కుటుంబాల పేరేంట్స్ ఆందోళన చేయడంతో  డీఎన్ఏ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.


ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శిశువుల తారుమారు  ఘటన సుఖాంతమైంది.  డీఎన్ఏ నివేదిక ఆధారంగా  శిశువులను  వైద్యులు  తల్లిదండ్రులకు అప్పగించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా  డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. 

గత ఏడాది డిసెంబర్  27న  తేదీ రాత్రిన  మంచిర్యాల ఆసుపత్రిలో  ఇద్దరు  పిల్లలకు   ఇద్దరు మహిళలు  జన్మనిచ్చారు.  ఒకరికి ఆడపిల్ల, మరొకరికి  మగపిల్లాడు పుట్టారు. అయితే  ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మగపిల్లాడే పుట్టాడని  రెండు కుటుంబాలు  గొడవకు దిగాయి. దీంతో   ఇద్దరు శిశువులను స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  డీఎన్ఏ టెస్టుల ఆధారంగా  ఇద్దరు పిల్లలను అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు.  రెండు  కుటుంబాలతో పాటు  శిశువుల నుండి శాంపిల్స్ తీసుకొని డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ఉదయం  సీల్డ్ కవర్లో  డీఎన్ఏ  రిపోర్టు  ఆసుపత్రికి చేరింది.  పోలీసుల సమక్షంలో  డీఎన్ఏ నివేదికను వైద్యులు  మంగళవారం నాడు మధ్యాహ్నం ఓపెన్ చేశారు.డీఎన్ఏ రిపోర్టు ప్రకారం ఆడశిశువు  మమతకు పుట్టినట్టుగా  తేలింది.  ఆసిఫాబాద్ కు చెందిన  పావనికి  మగపిల్లాడు పుట్టాడని  ఈ నివేదిక తెలిపింది.  ఈ నివేదిక ప్రకారంగా  వైద్యులు  చిన్నారులను  పేరేంట్స్ కు అందించారు.

Latest Videos

సిబ్బంది పొరపాటు కారణంగా....

మంచిర్యాల జిల్లాలోని ఆసిఫాబాద్  పట్టణంలోని రవిచంద్రకాలనికి చెందిన  బొల్లం పావని, కోటపల్లి మండలం  రొయ్యలపాడుకు  చెందిన  దుర్గం మమతలు డెలీవరీ కోసం ఆసుపత్రిలో చేరారు. వీరిద్దరికి గత ఏడాది డిసెంబర్  27న రాత్రి  సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించారు.  ఒకరికి మగ శిశువు, మరొకరికి  ఆడ శిశువు జన్మించింది.

మమత కుటుంబ సభ్యులకు  మగపిల్లాడు పుట్టాడని  ఆ శిశువును  అప్పగించారు  ఆసుపత్రి సిబ్బంది. ఆ తర్వాత కొద్దిసేపటికే పొరపాటు జరిగిందని  మమతకు ఆడపిల్ల పుట్టిందని  మగశిశువును  ఇవ్వాలని సిబ్బంది కోరారు. కానీ మమత కుటుంబ సభ్యులు  అంగీకరించలేదు. పావని కుటుంబ సభ్యులు  మగ శిశువును ఇశ్వాలని పట్టుబట్టారు. దీంతో డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని   అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

 


 

click me!