తెలంగాణలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల్లో దియోబంద్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దియోబంద్ కు హాజరైనావరికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నట్లు తేలింది.
హైదరాబాద్: తెలంగాణ కరోనా వైరస్ కేసుల్లో దియోబంద్ ట్విస్ట్ కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దియోబంద్ కు, అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినవారికి కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా తేలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం అటువంటి కేసులు రెండు బయటపడ్డాయి.
దాంతో దియోబంద్ కు, అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినవారి లెక్కలను తీయడంలో అధికారులు మునిగిపోయారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు వెళ్లిన కొందరు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దియోబంద్ కు వెళ్లినట్లు, కొందరు అజ్మీర్ దర్గాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
undefined
మర్కజ్ మాదిరిగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దియోబంద్ జరిగింది. దియోబంద్ కు వెళ్లివచ్చిన ఇద్దరు నిర్మల్ జిల్లాకు చెందినవారు. దాంతో నిర్మల్ జిల్లాలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 19కి చేరింది. వారిద్దరిని క్వారంటైన్ కు తరలించారు.
ఇదిలావుంటే, ఆసిఫాబాద్ లో నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వ్యక్తికి తొలుత కరోనా నెగెటివ్ వచ్చింది. అయితే, ఆ తర్వాత అతనికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అతని ఇద్దరు కుమారులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వారిని క్వారంటైన్ కు తరలించారు. అతని ఇద్దరు కుమారులు కూడా ఎక్కడికీ ప్రయాణించలేదు.
కాగా, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో మరో కరోనా వైరస్ కేసు బయటపడింది. దీంతో గ్రామంలో మూడు కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. చేగూర్ గ్రామాన్ని అధికారులు హాట్ స్పాట్ గా ప్రకటించారు.