దిల్ రాజు గులాబీ గూటికి చేరేదెప్పుడో?

Published : Aug 20, 2017, 05:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
దిల్ రాజు గులాబీ గూటికి చేరేదెప్పుడో?

సారాంశం

దిల్ రాజు చేరికపై జోరుగా ప్రచారం డిఎస్ ఫ్యామిలీతో లంకె ఉండే చాన్స్  సిట్టింగ్ నేతల్లో టెన్షన్ ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆందోళన

సినీ నిర్మాత దిల్ రాజు అలియాస్ వి.వెంకటరమణారెడ్డి టిఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం ఊపందుకుంటన్నది. ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. దిల్ రాజు టిఆర్ఎస్ పార్టీలోకి వస్తారన్న ప్రచారం మొదలైన నాటినుంచి నిజామాబాద్ జిల్లా రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోతున్నాయి.

సినీ ప్రొడ్యూసర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన దిల్ రాజు ప్రస్తతం  రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. ఆయనను రాజకీయాల్లోకి రావాలని సిఎం కెసిఆర్ ఆహ్వానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆయన సొంత గ్రామం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. దీంతో దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మరి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మొత్తానికి మొత్తం సభ్యులు టిఆర్ఎస్ వారే గెలిచారు. దీంతో ప్రస్తుతానికి నిజామాబాద్ లో ఎవరిని కదిలించినా ఇబ్బంది తప్పదు. మరి దిల్ రాజు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు? ఆయనకు సీటు ఎక్కడిస్తారన్నది చర్చనీయాంశమైంది.

దిల్ రాజు నేడు కాకపోయినా రేపైనా టిఆర్ఎస్ లోకి రావడం ఖాయమైపోయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే ఆయన ఫిదా సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిజామాబాద్ లో ఏర్పాటు చేశారు. ఇది ఇటు సినీ పరంగా అటు రాజకీయ పరంగానూ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే దిల్ రాజు నిజామాబాద్ లో ఫిదా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో కాకుండా నిజామాబాద్ ఎంపిక చేసుకోవడం అంటే రాజకీయ కోణం దాగి ఉందని చెబుతున్నారు.

అయితే అనేకరకాల చర్యలు సాగుతున్నాయి. రానున్ ఎన్నికల్లో  సిఎం కుమార్తె కవిత  అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తే నిజామాబాద్ ఎంపి సీటు దిల్ రాజుకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అది కాకపోతే సమీకరణాలు మారి ఎవరైనా బిజెపి వైపు పోతే ఆ సీటు దిల్ రాజుకు ఇవ్వొచ్చని చెబుతున్నారు. ప్రస్తతం ఇప్పుడు దిల్ రాజుకు కేటాయించే సీటు ఏదనేది ఇంకా తేలలేదు. ఒకవేళ జహీరాబాద్ పార్లమెంటు సీటు కేటాయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఒక టిఆర్ఎస్ నేత చెప్పారు.

దిల్ రాజు పార్టీలో చేరతానన్న ప్రచారం జరిగిన నాటి నుంచే నిజామాబాద్ లో టిఆర్ఎస్ శ్రేణుల్లో కలవరపాటు మొదలైంది. ఇప్పటికే ఉన్న సిట్టింగ్ లలో గుబులు మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు. దిల్ రాజు రూపంలో తమకు ఉపద్రవం ముంచుకొస్తదేమోనన్న భయంతో ఉన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ కు బిగాల గణేష్ గుప్త ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే రూరల్ కు బాజిరెడ్డి గోవర్దన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దిల్ రాజు రూపంలో వీరిద్దరికీ ప్రమాదం పొంచి ఉండొచ్చని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. మరి ఎక్కువ ప్రమాదం బాజిరెడ్డి గోవర్దన్ కే ఉండొచ్చని అంటున్నారు. మరి దిల్ రాజు వస్తే బాజిరెడ్డిని కదిలించి ఎక్కడ సీటు ఇస్తారో అన్న చర్చ కూడా జరుగుతున్నది.

అదేదీ కాకుండా ఎంపి సీటు ఇస్తే మరి ప్రస్తుతం ఎంపిగా ఉన్న కవిత రూపంలో ఎవరికి ప్రమాదం  ఉందో అన్నది కూడా చర్చలు సాగుతున్నాయి.

దసరా తర్వాత దిల్ రాజు చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ డిఎస్ ఫ్యామిలీ బిజెపి వైపు అడుగులేస్తే... వెనువెంటనే దిల్ రాజుకు గులాబీ కండవా కప్పి టిఆర్ఎస్ లో చేర్చుకోవచ్చని చెబుతున్నారు. డిఎస్ ప్రభావం నిజామాబాద్ జిల్లాలోనే లేదన్న ఇంప్రెషన్ ఇవ్వడం కోసమైనా దిల్ రాజు చేరికను ఖరారు చేయవచ్చని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌