టీ కాంగ్రెస్‌లో వివాదాలకు చెక్‌ పెట్టేందుకు చర్యలు వేగవంతం.. నేడు హైదరాబాద్‌కు దిగ్విజయ్ సింగ్..!

By Sumanth KanukulaFirst Published Dec 21, 2022, 9:39 AM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పార్టీ నేతల మధ్య వివాదాలకు చెక్ పెట్టేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. 

తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పార్టీ నేతల మధ్య వివాదాలకు చెక్ పెట్టేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం.. పలువురు సీనియర్ నేతలకు ఫోన్‌లు చేసి సమస్యలను పరిష్కరించనున్నట్టుగా హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కపెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ రోజు రాత్రి 7.45 గంటల సమయంలో దిగ్విజయ్ సింగ్‌ హైదరాబాద్‌ చేరుకోనున్నట్టుగా సమాచారం. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలపై పట్టున్న దిగ్విజయ్.. గురువారం రేవంత్ రెడ్డి వర్గంతో పాటు, సీనియర్లతో కూడా భేటీ కానున్నారు. 

అయితే గాంధీ భవన్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేస్తారా? లేదా సీనియర్ నాయకుల ఇంటికే దిగ్విజయ్ నేరుగా వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. దిగ్విజయ్ ఎంట్రీతో.. టీ కాంగ్రెస్‌‌లో నేతల మధ్య వివాదాలను చెక్ పడుతుందని ఆ పార్టీ క్యాడర్ భావిస్తుంది. 

ఇక, పీసీసీ కమిటీల విషయంలో అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరిగిందన్న సీనియర్ నేతలు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉమ్మడి గళం వినిపించారు. వలస వచ్చినవారికే ఎక్కువ పదవులు దక్కాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ వర్గానికి చెందిన 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో టీ కాంగ్రెస్‌లో ముసలం తీవ్రతరమైంది. ఒర్జినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస నేతలుగా పరిస్థితులు మారాయి. 

ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్‌లో వివాదాలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే దిగ్విజయ్ సింగ్.. కొందరు సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడి.. ప్రతి ఒక్కరి వాదనలు వింటామని చెప్పారు. అలాగే మంగళవారం సాయంత్రం జరగాల్సిన సీనియర్ నేతల కీలక సమావేశం రద్దయ్యేలా చేశారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా అసమ్మతి నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేందుకు దిగ్విజయ్‌ సింగ్‌ను హైదరాబాద్‌కు పంపనున్నట్టుగా చెప్పారు. అలాగే సమన్వయం పాటించాల్సిందిగా నేతలకు సూచించినట్టుగా తెలిసింది. అయితే మీడియాతో అనధికారికి చిట్‌చాట్‌లో మాట్లాడిన మల్లు భట్టివిక్రమార్క.. పీసీసీ కమిటీలలో కొత్తగా నియమించబడిన నాయకులను తొలగించాలని, వారు రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేయలేదని అన్నారు. పార్టీ కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతున్న అసలైన కాంగ్రెస్ వాదులకు న్యాయం జరగాలన్నదే తమ అభిప్రాయం అని చెప్పారు. 

click me!