ప్రయాణికుడి ఫోన్‌లో ఒకలా, డ్రైవర్ ఫోన్‌లో ఒకలా: క్యాబ్ ఛార్జీలలో గందరగోళం

By Siva KodatiFirst Published May 1, 2019, 12:27 PM IST
Highlights

క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన ఛార్జీ సదరు ప్రయాణికుడి ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా, డ్రైవర్ ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా చూపిస్తుండటంతో ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

నగర జీవికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న ఓలా, ఉబెర్ సేవలపై మరో వివాదం రాజుకుంది. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన ఛార్జీ సదరు ప్రయాణికుడి ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా, డ్రైవర్ ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా చూపిస్తుండటంతో ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  

ఇటీవల ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ నుంచి ఆటోనగర్‌కు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తన ప్రయాణానికి సంబంధించి రూ.344.30 ఛార్జ్ కనిపించింది. ఇదే సమయంలో డ్రైవర్ మొబైల్‌లో రూ.1120.18 డిస్‌ప్లే అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.

చివరికి ఉబర్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా.. ప్రయాణికుడి ఫోన్‌లో నమోదైన విధంగా చెల్లించాలని.. డ్రైవర్‌కు అతని మొబైల్‌లో చూపించిన విధంగా వసూలు చేయాలని రెండు రకాలుగా సమాధానం రావడంతో ఇద్దరు ఖంగుతిన్నారు.

మరోవైపు ఓలామనీ నుంచి నగదు చెల్లించేందుకు చాలా మంది డ్రైవర్లు అంగీకరించడం లేదు. నగదు రూపంలో బిల్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓలామనీ నుంచి తమ అకౌంట్‌లోని నగదు బదిలీ కావడం లేదని.. దీంతో తాము నష్టపోవాల్సి వస్తుందని డ్రైవర్లు వాదిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ఉబర్, ఓలా క్యాబ్ అగ్రిగేట్ సంస్ధలు మాత్రం సమస్యను పరిష్కరించడం లేదు. 

కారణం ఇదేనా: 
సాధారణంగా ప్రయాణికులు క్యాబ్ చేసుకున్నప్పుడు ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండొచ్చు. ఆ సమయంలో తక్కువ ఛార్జీలు నమోదవుతాయి. రద్దీ, ప్రయాణ సమయం పెరిగే కొద్దీ ఛార్జీల్లో కొంత మేరకు వ్యత్యాసం ఉంటుంది.

ఉదాహరణకు మొదట రూ. 344గా మొబైల్‌లో చూపిస్తే.. ప్రయాణం పూర్తయిన తర్వాత ఇది రూ.405కు పెరగొచ్చు. రద్దీ తక్కువగా ఉండి.. నిర్ధారిత సమయం కంటే తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకున్నప్పుడు ఛార్జీలు కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

అంతే కానీ ఏకంగా రూ.1,120 మాత్రం పెరిగే అవకాశం ఉండదు. అయితే సాంకేతిక కారణాల వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని క్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఒకవేళ ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం అనంతరం వారి ప్రయాణాల్లో తగ్గింపు ఉంటుందని చెప్పి అప్పటికప్పుడు సమస్యను దాటవేస్తున్నారు.

అయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండే సమయాలను రద్దీ వేళలుగా పరిగణిస్తారు. ఈ సమయాలలో క్యాబ్ ఛార్జీలు అనూహ్యంగా పెరుగుతాయి.

ఒక్కోసారి సాధారణ ఛార్జీలు రెట్టింపవుతాయి. అయితే ఏమాత్రం రద్దీ లేని వేళల్లోనూ ఇలాంటి సమస్యలు రావడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

click me!