Latest Videos

ఇద్దరూ డిప్యూటీ సీఎంలే ... మరి పవన్ కు దక్కే గౌరవం భట్టికి ఏది..? 

By Arun Kumar PFirst Published Jun 17, 2024, 1:43 PM IST
Highlights

ఇద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన డిప్యూటీ సీఎంలే... కానీ ఒకరికి అధికంగాా, మరొకగా తక్కువగా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంట. పవన్ కల్యాణ్ కు దక్కుతున్న గౌరవం తెెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి దక్కడంలేదట... 

హైదరాబాద్ : ఒకప్పుడు ఒకే రాష్ట్రం... కారణాలేమైనా రెండుగా విడిపోయాయి. ఎవరి పాలన వాళ్లు చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే వుంది... కానీ అభివృద్ది, సంక్షేమమే కాదు ప్రతి విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య పోలిక ఒక్కోసారి విపరీతాలకు దారితీస్తోంది. ఇలా తాజాగా ఇరు రాష్ట్రాల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాల మధ్య ఓ పోలిక తెలంగాణను మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టెలా వుంది. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రేవంత్ కు సంతోషాన్ని కలిగించవచ్చు... కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే రేవంత్ ను ఇబ్బందిపెట్టేలా కనిపిస్తున్నాయి.  

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయంలో పవన్ కల్యాణ్ ది కీలక పాత్ర. జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంలోనే కాదు టిడిపి, బిజెపి విజయాల్లోనూ పవన్ పాత్ర వుంది. ఇలా కింగ్ మేకర్ గా నిలిచిన పవన్ కు కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కడమే కాదు పాలనాపరంగా తగిన గౌరవం దక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం పవన్ కల్యాణ్ దే... డిప్యూటీ సీఎంతో పాటు పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది, అటవీ‌-పర్యావరణ, శాస్త్ర సాంకేతికత వంటి కీలక శాఖలు ఆయనకు దక్కాయి. 

ఇదే సమయంలో సీఎం చంద్రబాబు తనకు దక్కే గౌరవమే పవన్ కల్యాణ్ కు దక్కేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోను ఏర్పాటుచేస్తారు... ఎవరు సీఎంగా వుంటే వారి ఫోటో వుంటుంది. అంటే ప్రస్తుతం రాష్ట్ర సీఎం చంద్రబాబు కాబట్టి ఆయన పోటో వుండాలి. కానీ తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుచేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ చిత్రపటాలు దర్శనమిస్తున్నాయి. 

ఇలా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కు తగిన  ప్రాధాన్యత, గౌరవం ఇవ్వడం  తెలంగాణ రాజకీయాల్లో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంకు అక్కడి ముఖ్యమంత్రి ఇస్తున్న గౌరవం తెలంగాణ డిప్యూటీ సీఎంకు ఇక్కడి సీఎం ఇవ్వడంలేదన్న చర్చ సాగుతోంది. అక్కడ మిత్రపక్ష నాయకుడికి దక్కుతున్న గౌరవం ఇక్కడ సొంతపార్టీ నాయకుడికి దక్కడంలేదనే   ప్రచారం జరుగుతోంది. కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబును ఫాలో కావాలని... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు దక్కే ప్రాధాన్యత, గౌరవమే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు దక్కాలని కోరుతున్నారు. ఇలా భట్టి అభిమానులు, కొందరు దళిత నాయకులు సోషల్ మీడియా వేదికన సీఎం రేవంత్ తీరును తప్పుబడుతున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరువేరు... కాబట్టి వీటిని పోల్చడం సరికాదన్నది కొందరు కాంగ్రెస్ నాయకుల వాదన. అయినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రేవంత్ ఎక్కడా గౌరవం తగ్గించడం లేదని... కీలకమైన ఆర్థిక శాఖ కేటాయించారని అంటున్నారు. అంతేకాదు  గతంలో సీఎం నివాసంగా వున్న ప్రజా భవన్ ను భట్టి కోరినవెంటనే ఆయనకే కేటాయించారని అంటున్నారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ సీఎం రేవంత్ ను సమానంగానే భట్టికి కూడా గౌరవం దక్కుతోందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.  

ఏదేమైనా పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత, గౌరవాన్నే భట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి ఇవ్వాలన్నది కొందరు కాంగ్రెస్, దళిత నాయకుల వాదన. ముందు తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి ఫోటో ఏర్పాటుచేయాలన్నది వారి డిమాండ్. అంతేకాదు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ రేవంత్ కు సమానంగా భట్టి విక్రమార్కకు చూడాలని కోరుతున్నారు. ఇలా ఏపీలో పరిస్థితులు తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేపుతున్నాయి. 


 

click me!