ధోకేబాజ్ పార్టీ.. కాంగ్రెస్ అబ‌ద్ద‌పు హామీల‌తో మోస‌పోవ‌ద్దు : ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పిలుపు

By Mahesh Rajamoni  |  First Published Nov 8, 2023, 10:58 PM IST

BRS supremo KCR: ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను తొలగిస్తామని కాంగ్రెస్ చేస్తున్న వాగ్దానాల‌ను ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. రైతుల భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు, భూమి రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడానికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ధ‌ర‌ణిని తీసుకువ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. 
 


Telangana Assembly Elections 2023: రాష్ట్రం అనర్హుల చేతుల్లోకి వెళితే తెలంగాణలో అభివృద్ధి వేగం దెబ్బతింటుందని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) అన్నారు. సిర్పూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, పరిశ్రమలు మూతపడటం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించిందనీ, ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తోందని తెలిపారు. దేశంలో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

24 గంటల కరెంటు, సామాజిక భద్రత పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకం, రైతులకు 'రైతుబంధు' పెట్టుబడి మద్దతు పథకం సహా తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతులకు కేవలం మూడు గంటల కరెంటు ఇవ్వడానికే కాంగ్రెస్ నేతలు మొగ్గు చూపుతున్నారనీ, రైతులకు 'రైతుబంధు' పథకాన్ని వృథా ఖర్చుగా అభివర్ణించార‌ని ఆరోపించారు. ఇది వృధా ఖర్చునా? అని ప్రశ్నించారు. ఏది వ్యర్థమో, ఎవరు వ్యర్థమో మీరే నిర్ణయించుకోవాలని ప్ర‌జ‌ల‌ను  కేసీఆర్ కోరారు. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెసు జాప్యం చేసిందని ఆయన ఆరోపించారు.

Latest Videos

కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసిందని (అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసింది) అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ను 'ధోకేబాజ్' (మోసపూరిత) పార్టీగా అభివర్ణించిన ఆయన, తెలంగాణ ఏర్పాటు హామీ మేరకు 2004లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్ )తో పొత్తు పెట్టుకుందని చెప్పారు. ప్రజల సుదీర్ఘ ఉద్యమం, తన నిరవధిక నిరాహారదీక్ష తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించిందనీ, కానీ మళ్లీ మాట తప్పిందని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ఆందోళన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ చర్యలు చేపట్టిందన్నారు.

ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను తొలగిస్తామని కాంగ్రెస్ చేస్తున్న వాగ్దానాల‌ను ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. రైతుల భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు, భూమి రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడానికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ధ‌ర‌ణిని తీసుకువ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. ధరణిని రద్దు చేస్తే రైతుబంధు పథకం, ఇతర పథకాల కింద రైతులకు నేరుగా లబ్ధి ఎలా అందుతుంది? అని ప్రశ్నించారు. తాను బతికి ఉన్నంతవ‌ర‌కు తెలంగాణ లౌకిక రాష్ట్రంగానే ఉంటుందని అన్నారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపుతో ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

click me!