నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కల్వకుంట్ల కవిత మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను కుక్కా.. అని పిలిచినా సింపతీ రాదన్నారు.
నిజామాబాద్ : నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ మరోసారి విరుచుకుపడ్డారు. కవిత దొరసానిలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మా ఇంటి మీదికి మీ గుండాలను పంపినప్పుడు నీకు ఆడపడుచులు గుర్తుకు రాలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఆ సమయంలో మా అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది. ఆ విషయం తెలిసే గుండాలను, బ్రోకర్లను దాడికి పంపించావు అంటూ విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ… ‘నిన్ను కుక్కా అన్నా.. జైలులో వేసినా కూడా ప్రజల్లో నీకు సింపతి ఏమీ రాదు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మనిషి బతికున్నప్పుడు సహాయం చేయరు కానీ చచ్చిపోతే ఐదు లక్షల బీమా ఇస్తామంటారా? అంటూ ప్రశ్నించారు.
undefined
బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ దంపతులు..
కరోనా సమయంలో వైద్యం అందక లక్షల రూపాయలను ప్రజలు ఖర్చు చేసినప్పుడు.. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయలేదని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఆ సమయంలో వైద్యం చేయించుకునే డబ్బులు లేక ఎంతోమంది అమాయక, నిరుపేద ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.. ఆ సమయంలో ఒక్క రూపాయి సహాయమైనా వారికి చేశారా? అని నిలదీశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన కుమారుడు కెటిఆర్ చనిపోతే తమ పార్టీ నగదు బహుమతి ఇస్తుందని బిజెపి నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి మంగళవారం వివాదానికి తెర లేపారు. మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా పథకం కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే, మరణించిన రైతు 56 ఏళ్లలోపు వయసు ఉండాలని...అప్పుడే ఆ కుటుంబాలకు బీమా ఇస్తామని బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని బీజేపీ నేత అరవింద్ ఆరోపించారు.
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై ధర్మపురి అరవింద్ మండిపడుతూ.. కేసీఆర్ చనిపోతే బీజేపీ రూ.5 లక్షలు ఇస్తుందని, కేటీఆర్ (కేసీఆర్ కొడుకు) చనిపోతే ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. "కేసీఆర్ కు సమయం దగ్గర పడ్డది. చిన్నవారు చనిపోతే ఎక్కువ విలువ, ఎక్కువ డబ్బు ఆయన మాట ప్రకారమే.. కవిత చనిపోతే, నేను రూ. 20 లక్షలు ప్రకటిస్తాను" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. అరవింద్ ధర్మపురి నాపై చేసిన వ్యాఖ్యలు మీ కూతుళ్లపై చేస్తే మీరు మౌనంగా ఉంటారా..? అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లో ఉన్నాననే మీరిలా మాట్లాడుతున్నారు? కేసీఆర్ కూతురి మీదే ఇలా మాట్లాడతారా? ఇదేనా రాజకీయం? అంటూ ఘాటుగా స్పందించారు.
కవిత అరవింద్ వ్యాఖ్యల మీద విరుచుకుపడుతూ... “నువ్వు చనిపోతే రూ.20 లక్షలు, నీ అన్న చనిపోతే రూ.10 లక్షలు, నీ తండ్రి చనిపోతే రూ.5 లక్షలు.. అంటూ ఇలా ఇంకా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు.. దీనికి భాష, వాడిన పదాల ఎంపిక, వ్యక్తిగత దాడులు, ఇది ఎంత వరకు సరైనదో ప్రజలు ఆలోచించాలి’’ అని ఆమె అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వాడిన ‘అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్’ పై ‘ఆలోచించాలని’ రాష్ట్ర ప్రజలను కవిత కోరారు.