హైదరాబాద్ లో మరోసారి గోనెసంచిలో మృతదేహం కలకలం రేపుతోంది. లంగర్ హౌజ్ ప్రాంతంలో రెండు గోనెసంచుల్లో ముక్కలుగా నరికిన దివ్యాంగుడి మృతదేహం లభించింది.
హైదరాబాద్ : హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. గోనెసంచిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. లంగర్ హౌజ్ ప్రాంతంలో రెండు గోనెసంచుల్లో ముక్కలుగా నరికిన దివ్యాంగుడి మృతదేహం లభించింది. ఎక్కడో చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి రెండు గోనెసంచుల్లో కుక్కారు. వాటిని లంగర్ హౌజ్ ప్రాంతంలో ఫుట్ పాత్ మీద పెట్టి వెళ్లారు.
ఓ ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, గోనెసంచులను దించి.. రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద పెడుతుండడం స్థానికులు చూశారు. కాసేపటికి వాటినుంచి రక్తం కారుతుండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అందులో మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి.
బాపూఘాట్ నుంచి లంగర్ హౌజ్ కు వచ్చే ప్రాంతంలో, మిలట్రీ ఏరియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాళీ మందిర్ సమీపంలో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు పది రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ మహిళను చంపి గోనెసంచితో మృతదేహాన్ని ముక్కలుగా చేసి పెట్టి వెళ్లారు. వరుస ఘటనలతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆదారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితులుగా గుర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.