ముందస్తు ఎన్నికలు అప్రజాస్వామ్యం : దత్తాత్రేయ

By rajesh yFirst Published Sep 6, 2018, 5:34 PM IST
Highlights

 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బలపడుతున్నాయన్న భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని బీజేపీ సీనియర్ నేత ఎంపీ బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బలపడుతున్నాయన్న భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని బీజేపీ సీనియర్ నేత ఎంపీ బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. 

ప్రజావ్యతిరేకతకు ప్రతిపక్ష పార్టీలు బలం తోడైతే తన ఉనికిని కోల్పోతానన్న భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఏకచక్రాధిపతిగా వ్యహరిస్తున్నారని ఏకవ్యక్తి పరిపాలన ప్రమాదకరమైనదన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలకు స్వతంత్ర్యం లేదని ఆరోపించారు. 

మజ్లిస్ పార్టీ అండ లేకపోతే  కేసీఆర్ కు రాజకీయ ఉనికి లేదని దత్తాత్రేయ ఆరోపించారు. మజ్లిస్ పార్టీ సూచనలతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేశారని మండిపడ్డారు. 
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు, టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. 

మరోవైపు కేసీఆర్ హైదరాబాద్ జంటనగరాల ప్రజలను మోసం చేశారని దుయ్యబుట్టారు. ఎన్నికల్లో కేసీఆర్ మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల పెరుగుదలను అణిచివెయ్యాలన్న ఆలోచనతో కనీసం మీటింగ్ లకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. బీజేపీ ఆరు మాసాల నుంచే ఎన్నికలకు రెడీగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఎన్నికలంటే భయం లేదని స్పష్టం చేశారు.  

click me!