సైబరాబాద్ : చోరీ బాధితులకు చేరిన రూ. కోటిన్నర రికవరీ సొత్తు .. సంతృప్తిగా వుందన్న సజ్జనార్

By Siva KodatiFirst Published Jul 27, 2021, 6:39 PM IST
Highlights

వివిధ చోరీ కేసుల్లో పోయిన కోటిన్నర విలువైన సొత్తును సైబరాబాద్ పోలీసులు మంగళవారం బాధితులకు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు పోలీసుల పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని సీపీ సజ్జనార్ అన్నారు

సాధారణంగా దొంగతనం జరిగిన తర్వాత బాధితులకు ఒక అనుమానం వుంటుంది. మన సొమ్ము దొరుకుతుందా..? ఒక వేళ దొరికినా పోలీసులు దానిని వెనక్కి ఇస్తారా అని. ఇలాంటి అనుమానాలకు తెరదించారు సైబరాబాద్ పోలీసులు. వివిధ చోరీ కేసుల్లో పోయిన కోటిన్నర విలువైన సొత్తును సైబరాబాద్ పోలీసులు మంగళవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. పోగొట్టుకున్న సొత్తును ఇప్పించాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని... ఈరోజు అది సాధ్యమైందన్నారు. ఇప్పటి నుంచి తరచూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రయత్నం చేస్తానని సజ్జనార్ స్పష్టం చేశారు.

176 కేసుల్లో రూ.కోటిన్నర విలువైన సొత్తును నేడు బాధితులకు తిరిగి ఇస్తున్నామని.. కేసును ఛేదించడం ఒక ఎత్తు అయితే పోయిన సొత్తు రికవరీ చేయడం ఇంకో ఎత్తు అని సీపీ అన్నారు. చోరీ కేసులో సొత్తును తిరిగి ఇప్పించడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమైందని సజ్జనార్ ప్రశంసించారు. చోరీ అయిన సొత్తును తిరిగి ఇప్పించడం పోలీసు వ్యవస్థలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు.

నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలని.. అలసత్వం వహించరాదని సీపీ వెల్లడించారు. వెంటనే ఫిర్యాదు చేస్తే నేరస్థుడిని పట్టుకునే అవకాశం ఉంటుందని... లేనిపక్షంలో అతడు మరిన్ని నేరాలు చేస్తాడని సజ్జనార్ హెచ్చరించారు. బాధితులకు ఇక నుంచి శ్రమ లేకుండా చోరీ అయిన సొత్తును కోర్టు నుంచి తిరిగి ఇప్పించే బాధ్యతను సైబరాబాద్‌ పోలీసులు తీసుకుంటారని సీపీ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు పోలీసుల పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని సజ్జనార్ అన్నారు. సైబరాబాద్‌ పోలీసులకు ఈరోజు సంతృప్తికరమైన రోజు అని సీపీ వ్యాఖ్యానించారు. 

click me!