హుజూర్ నగర్ ఉప ఎన్నిక టెన్షన్: మద్దతుపై తేల్చని సిపిఐ

By narsimha lodeFirst Published Sep 30, 2019, 6:03 PM IST
Highlights

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐ  మద్దతు ఎవరికి లభిస్తోందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో  ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయమై సీపీఐ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై ఉప ఎన్నికల్లో మద్దతు విషయమై తేల్చనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో పాటు జాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మద్దతు విషయమై సీపీఐ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

సోమవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీపీఐ కార్యవర్గం సమావేశమై హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఏపార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయమై కూడ ఆ పార్టీ నాయకత్వం చర్చించింది.

అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం సమావేశం కానుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మద్దతు కోసం సంప్రదింపులు జరిపాయి. సీపీఎం కూడ సీపీఐను మద్దతు ఇవ్వాలని కోరిందని సమాచారం.

అయితే ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు వివరించారు.

హుజూర్ నగర్  అసెంబ్లీ ఎన్నికల్లో  మద్దతు విషయమై రెండు పార్టీల  నుండి వచ్చిన ప్రతిపాదనలను సీపీఐ జాతీయ సమితి దృష్టికి కూడ తెలంగాణ రాష్ట్రసమితి నేతలు తీసుకెళ్లారు.

ఈ విసయమై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా దృష్టికి సీపీఐ రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్లింది.  తెలంగాణ రాష్ట్ర సీపీఐ ఇంచార్జీగా ఉన్నఅతుల్ కుమార్ అంజన్ కూడ అక్టోబర్ 1వ తేదీన జరిగే  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు.

సీపీఐ జాతీయ నేతల సలహాలను కూడ పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని మద్దతు విషయమై  సీపీఐ జాతీయ నాయకత్వం రాష్ట్రకమిటీకి సూచనలు ఇస్తోందా.. లేదా రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా  నిర్ణయాలు తీసుకోవాలని  కోరుతోందా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుండి సీపీఎం, భువనగిరి నుండి సీపీఐలు పోటీ చేశాయి.ఈ రెండు స్థానాల్లో పరస్పరం ఈ పార్టీలు మద్దతిచ్చాయి. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో సీపీఎం పోటీ చేస్తోంది. పారేపల్లి శేఖర్ రావు ఈ స్థానం నుండి బరిలోకి దిగారు. ఆ పార్టీ కూడ సీపీఐ మద్దతును కోరినట్టుగా సమాచారం.

  

click me!