Munugode Bypoll 2022: పోటీపై మహాసభల తర్వాత నిర్ణయం తీసుకోనున్న సీపీఐ

By narsimha lodeFirst Published Aug 12, 2022, 4:44 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే విషయమై నిర్ణయాన్ని పార్టీ మహాసభల తర్వాత నిర్ణయం తీసుకొంటామని సీపీఐ నేతలు చెబుతున్నారు. సీపీఐ నేతలు చండూరులో ఇవాళ సమావేశమయ్యారు. 
 

నల్గొండ: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  పార్టీ మహాసభలు పూర్తైన తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సీపీఐ నేతలు చెబుతున్నారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చండూరులో సీపీఐ నేతలు శుక్రవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మహాసభలతో పాటు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక విషయమై పార్టీ నేతలు చర్చించారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ అభ్యర్ధులు పలుమార్లు విజయం సాధించారు.  సీపీఐ లేదా కాంగ్రెస్ అభ్యర్ధులే ఈ స్థానం నుండి విజయం సాధించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో పోటీ విషయమై సీపీఐ నేతలు చర్చిస్తున్నారు. 

also read:నా రాజీనామాతో మునుగోడు ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై సీపీఎంతో కూడా చర్చిస్తామని సీపీఐ నేతలు చెబుతున్నారు.ఈ నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎంకు ఓటు బ్యాంకు ఉంది. అయితే ఈ స్థానంలో  లెఫ్ట్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తాయా లేదా  కలిసి పోటీ చేస్తాయా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఉప ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తాయా లేదా ఏదైనా పార్టీకి మద్దతును ఇస్తాయా అనే విషయమై కూడా ఆ పార్టీలు నిర్ణయించుకోలేదు. ఈనియోజకవర్గంలో పోటీ చేయాలా వద్దా అనే విషయాన్ని పార్టీ మహాసభల తర్వాత ప్రకటించనున్నట్టుగా సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు 

గతంలో  రాష్ట్రంలో నాలుగు స్థానాలకు  జరిగిన ఉప ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు పోటీ చేయలేదు.  ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాయా లేదా అనేది త్వరలోనే తేలనుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 8వ తేదీన రాజీనామా చేశారు.ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు.  దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్ పార్టీలు ఇతర పార్టీలకు మద్దతిస్తాయా లేదా పోటీ చేస్తాయా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఈ స్థానం నుండి ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న పల్లా వెంకట్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై  పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఒకవేళ ఈ స్థానం నుండి సీపీఐ పోటీ చేస్తే నెల్లికంటి సత్యంను బరిలోకి దింపే అవకాశంలేకపోలేదు.

click me!