సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు ఉన్నదా? ప్రత్యర్థులేనా? అనేది చర్చనీయాంశంగా మారింది. సీపీఐ పోటీ చేస్తున్న చోట సీపీఎం అభ్యర్థిని బరిలోకి దించలేదు. పరోక్షంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చింది. అదే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తున్న పాలేరులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటికి సీపీఐ మద్దతు ఇస్తున్నది. దీంతో పాలేరులో వామపక్షాల ఓట్లు ఎటు వెళ్లుతాయి? అనే చర్చ మొదలైంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. పార్టీల మధ్య పొత్తుల వ్యూవహారం ఇది వరకే కొలిక్కి వచ్చింది. అన్ని పొత్తులపై ఓ స్పష్టత ఉన్నది. కానీ, వామపక్షాల దారులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎంలు కలిసి ఉండాలని ప్రాథమికంగా అనుకున్నాయి. అవి రెండు కలిసే బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని అనుకున్నా.. సాధ్యం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి పలు మార్లు చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటులో సీపీఐ కాంప్రమైజ్ అయింది. కానీ, సీపీఐ మాత్రం ఖమ్మం నుంచి ఒక్క సీటైనా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. అది కుదరకపోవడంతో పొత్తు పొడవలేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రాథమిక అవగాహనకు విఘాతం కలిగింది.
కాంగ్రెస్ పొత్తు చర్చల నుంచి విరమించుకున్నట్టు సీపీఎం ప్రకటించినప్పుడు కొన్ని కీలక స్పష్టతలు ఇచ్చింది. 19 స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం తాము ప్రజానుకూల పాలనకు మద్దతు ఇస్తామని తెలిపింది. సీపీఐ అభ్యర్థి ఉన్న చోట తాము బరిలోకి దిగబోమని, ఆ పార్టీకే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అని, ఆ పార్టీ అధికారంలోకి రానివ్వకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. సీపీఐ అభ్యర్థి కూనంనేని పోటీ చేస్తున్న కొత్తగూడెం నుంచి సీపీఎం బరిలోకి దిగడం లేదు. పరోక్షంగా ఆయనకు మద్దతు ఇస్తున్నది. కానీ, సీపీఐ ఇందుకు భిన్నమైన పంథాను ఎంచుకుంది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పోటీ చేస్తున్న చోట సీపీఎం అభ్యర్థిని బరిలోకి దించలేదు - కానీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తున్న పాలేరులో మాత్రం సీపీఐ ఈ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తున్నది. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై బరిలో నిలుస్తున్నారు.
Also Read : కేసీఆర్‌పై అత్యధిక నామినేషన్లు.. అసలైన సవాల్ ఏమిటీ? ఒక్క ఈవీఎం ఎంతమంది అభ్యర్థులకు ఉపయోగించవచ్చు?
దీంతో పాలేరు సీటులో వామపక్షాల ఓట్ల మధ్య చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పోటీలో ఉండగా.. సీపీఐ నేతలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. దీంతో వామపక్షాల ఓటు బ్యాంకులో గందరగోళం చెలరేగే అవకాశం ఉన్నది. ఈ ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయా? సీపీఎంకు పడతాయా? అనేది ఇప్పుడు అస్పష్టంగానే ఉన్నది.
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుంటున్నాయని, ఇందులో భాగంగానే కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసే రోజే వారి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేశారు.