రెండు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్... మరో మైలురాయిని అందుకున్న తెలంగాణ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 15, 2021, 1:04 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారి సంఖ్య రెండు కోట్లకు చేరింది.

హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా  వ్యాక్సిన్ పొందినవారి(కనీసం ఒక్క డోస్ అయినా తీసుకున్నవారు) సంఖ్య రెండు కోట్లుకు చేరింది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళుతున్న వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ఈ ప్రక్రియలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా సచివాలయంలో కేక్ కట్ చేసి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను అభినందించారు సీఎస్. 

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓ.ఎస్.డి గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జి. శ్రీనివాస్ పాల్గొన్నారు. 

వీడియో

ఇక ఇటీవలే డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ట్రయల్ రన్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 9 నుండి 10వ తేదీ వరకు వికారాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ట్రయల్ రన్ చేపట్టారు. భూమికి 500 నుండి 700 అడుగుల ఎత్తులో డ్రోన్స్ ఎగురుతాయని ప్రభుత్వం తెలిపింది.  

డ్రోన్లు కరోనా వ్యాక్సిన్లతో పాటు ఇతర మందులను  సరఫరా చేయనుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డ్రోన్ల వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది.  

కేంద్ర ప్రభుత్వం కూడ డ్రోన్ల సహాయంతో కరోనా వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించింది.  దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో  డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రాథమికంగా చర్యలు తీసుకొంది. హెచ్ఐఎల్ ఇన్ ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ ఐసీఎంఆర్ తరపున దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మానవ రహిత ఏరియల్  వెహికల్ ద్వారా మెడికల్ కిట్స్, కరోనా వ్యాక్సిన్ సరఫరా కోసం టెండర్లను ఈ ఏడాది జూన్ మాసంలో ఆహ్వానించింది. కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగం కోసం  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఏడాది ఆరంభంలో షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. 

 

click me!