కరోనా సెకండ్ వేవ్: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయాలు

By Arun Kumar PFirst Published Nov 24, 2020, 8:53 AM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. 

హైదరాబాద్‌: వచ్చే నెల డిసెంబర్ లో కరోనా మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ముందుగానే అప్రమత్తమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. 

సీఎం కేసీఆర్ అధికారులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన వైద్యారోగ్య శాఖ ఎంతటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు రంగం సిద్దం చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 22 వేల పడకలుండగా 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సౌకర్యముంది. మిగతా పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రెండో దఫాలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఈ దృష్ట్యా ఇప్పటికే స్పెయిన్ లో మరోసారి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. యునైటెడ్ కింగ్ డమ్(UK) లోనూ నెల రోజులు లాక్ డౌన్ విధించారు. ఇదే తరహాలో ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఆంక్షలు విధించారు. అమెరికాలోనూ కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజుకు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. 

మరోవైపు మనదేశంలోనూ కరోనా కొన్ని రాష్ట్రాల్లో తీవ్రరూపం దాలుస్తోంది. ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో తెరుచుకున్న పాఠశాలలు కూడా మళ్లీ మూతపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు మళ్లీ మొదలయ్యాయి. అసలే చలికాలం కావడంతో కేసుల తీవ్రత మరింత పెరగొచ్చన్న ప్రచారం జరుగుతోంది. 

ఢిల్లీ, హరియాణా, ముంబై, అహ్మదాబాద్, ఇండోర్, రాజస్థాన్ లో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కొన్ని చోట్ల కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తమైంది. 

click me!