ఉమ్మినందుకు శిక్ష... రూ.500 జరిమానా విధించిన సర్పంచ్

By Arun Kumar P  |  First Published Apr 10, 2020, 11:03 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు అధికారులు,  స్థానిక ప్రజాప్రతినిధులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. 


సిరిసిల్ల: కరోనా మహహ్మారి వివిధ మార్గాల ద్వారా ఒకరినుండి మరొకరికి సంక్రమిస్తుండటంతో ఆ  మార్గాలన్నింటిని మూసివేసే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, చేతుల్లో తుమ్మకూడదని, చేతులను శానిటైజర్ తో శుభ్రపర్చుకోవాలంటూ ఇలా వైరస్ సోకే అవకాశమున్న వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

ఇక బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం ద్వారా కూడా ఈ  వైరస్ వ్యాప్తిచెందే అవకాశం వుంది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని... అవసరమైతే జరిమానాలు కూడా విధించాలని తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించింది. 

Latest Videos

ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలం అడవి పదిరలో లక్కం బాబు అనే వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో పలుమార్లు ఉమ్మి వేయడాన్ని గ్రామ సర్పంచ్ గమనించారు. దీంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ లక్కం బాబుకు రూ.500 జరిమానా విధించారు.  

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. ఇందులో 414 యాక్టివ్ కేసులు.  గురువారం కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో కరోనా వ్యాధితో సంభవించిన మరణాల సంఖ్య 12కు చేరుకుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ వివరాలను వెల్లడించారు 

కరోనా వైరస్ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరినవారిలో 45 మంది డిశ్చార్జీ అయినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి కొత్త కేసులు రాకపోవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం 665 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి కరోనా పాజిటివ్ ఉందని తేలిందని ఆయన చెప్పారు. లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు. లేదంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అన్నారు.  

పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 22వ తేదీనాటికి చికిత్స పొందుతున్నవారంతా డిశ్చార్జీ అవుతారని ఆయన చెప్పారు. లక్షణాలుంటే కింగ్ కోఠీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని, గాంధీ ఆస్పత్రి కరోనా వైరస్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తుందని ఆయన అన్నారు. హాట్ స్పాట్ గా ప్రకటించిన ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అవుతాయని ఆయన చెప్పారు. తెలంగాణలో 101 హాట్ స్పాట్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. 

కేసులు తగ్గుతున్నాయని లైట్ గా తీసుకోవద్దని ఆయన సూచించారు. లాక్ డౌన్ నియమాలను ప్రజలు పాటించాలని ఆయన సూచించారు. హాట్ స్పాట్ ప్రాంతాలను అధికారులు దిగ్బంధం చేస్తారని ఆయన చెప్పారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా అక్కడికే అందిస్తారని, బయటకు అసలు వెళ్లడానికి ఉండదని ఆయన చెప్పారు. 
 

click me!