బ్యాంకింగ్ రంగంపై కరోనా ఎఫెక్ట్... ఆ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్

By Arun Kumar PFirst Published Mar 23, 2020, 8:04 PM IST
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తాజాగా బ్యాకింగ్ రంగంపై పడింది. బ్యాంకుల వేళల్లో మార్పులు చేపట్టడమే కాదు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసేశారు. 

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని భారతదేశంలో రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్ ప్రభావం కేవలం ప్రజలపైనే కాకుండా ఇప్పటికే భారత ఆర్థికవ్యవస్థ , బిజినెస్, స్టాక్ మార్కెట్ లపై పడగా తాజాగా బ్యాకింగ్ వ్యవస్థపై కూడా పడింది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో అత్యవసర సేవలయినప్పటకి బ్యాంకుల టైమింగ్స్ లో కూడా మార్పులు చేపట్టక తప్పలేదు. 

ఈనెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఇక కరోనా ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలికంగా బ్యాంకింగ్ సేవలను మూసివేస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. 

బ్యాంకు ఖాతాదారులకు అన్ని సేవలు అందిస్తామని... అయితే అత్యవసరం అయితే తప్ప బ్యాంకుకు రావొద్దని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీవో) విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని... శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొంది. వీలైనంత వరకు అన్ని సేవలు అందిస్తామని, ఈ విషయంలో వినియోగదారులు కూడా తమవైపు నుంచి సాయం చేయాలని కోరింది. 

ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యలనే బ్యాంకు ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నారని, కాబట్టి అత్యవసరం అనుకుంటే తప్ప బ్రాంచ్‌లకు రావొద్దని కోరింది. మొబైల్, ఆన్‌లైన్ బ్యాకింగ్ చానల్స్ ద్వారా అందుబాటులో ఉన్న నాన్-ఎస్సెన్షియల్ సేవలను ఉపయోగించుకోవాలని.. 24 గంటలూ ఆ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఐబీవో అధికారులు తెలిపారు. 

అవసరం అనుకుంటే బ్యాంకులకు ఫోన్ చేయొచ్చని, ఐవీఆర్ సదుపాయాన్ని కూడా పొందొచ్చని పేర్కొన్నారు. నగదు జమ, ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్, రెమిటెన్స్, ప్రభుత్వ పరమైన లావాదేవీలు వంటివి తప్పకుండా అందుబాటులో ఉంటాయని వివరించారు.

click me!