అడవి దున్నకు కొమురం భీమ్ పేరు.. ఆదివాసీల నిరసన, వెనక్కి తగ్గిన నెహ్రూ జూ

By Siva KodatiFirst Published Jun 8, 2021, 7:13 PM IST
Highlights

కొమురం భీమ్.. ఆదివాసీల ఆరాధ్య దైవం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఆదివాసీల్లో స్పూర్తిని రగిలించారు. అటువంటి కొమురం భీమ్ పేరును ఓ అడవి దున్నకు పెట్టడం వివాదంగా మారింది.

కొమురం భీమ్.. ఆదివాసీల ఆరాధ్య దైవం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఆదివాసీల్లో స్పూర్తిని రగిలించారు. అటువంటి కొమురం భీమ్ పేరును ఓ అడవి దున్నకు పెట్టడం వివాదంగా మారింది. హైదరాబాద్ లోని ప్రఖ్యాత నెహ్రూ జూ పార్క్ లో ఓ అడవిదున్నకు కొమురం భీమ్ పెట్టడంతో వివాదాస్పదంగా మారింది. దీన్ని ఆదివాసీలు సహా తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించటంతో జూ అధికారులు వెనక్కి తగ్గారు. అనంతరం అడవిదున్నకు పెట్టిన కొమురం భీమ్ పేరును తొలగిస్తున్నామని జూపార్క్ క్యూరేటర్ ఆర్.శోభ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో వివాదానికి తెరపడినట్లయ్యింది. 

 

 

కాగా.. నెహ్రూ జూ పార్క్‌లోని అడవిదున్న ఒక బిడ్డ కు జన్మనిచ్చింది. ఆ లేగ దున్నకు జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల ఆద్యుడు కొమురం భీమ్ అని నామకరణం చేశారు. ఓ అడవిదున్నకు కొమురం భీం పేరు పెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

కొమురం భీమ్ అక్టోబర్ 22, 1901లో ఆదివాసీల కుటుంబంలో జన్మించారు. నిజాం దొరల పాలనలో అణగారిన వర్గాలు హింసలు అనుభవించేవారు. హైదరాబాదు విముక్తి కోసం జరిగిన పోరాటానికి కొమురం భీమ్ నాయకత్వం వహించాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఆ ఉద్యమంలో వీరమరణం పొందాడు.
 

click me!