Hyderabad: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 లక్షల ఓట్లతో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 100 రోజులు కేటాయించాలనీ, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 లక్షల ఓట్లతో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 100 రోజులు కేటాయించాలనీ, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పార్టీ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో పెద్దసంఖ్యలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
వివరాల్లోకెళ్తే.. 90 లక్షల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 90 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, వచ్చే 100 రోజులను కేటాయించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమనీ, ప్రజలు తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చేది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జాతీయ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశంతో పాటు బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నెల 18న వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యకర్తలు, ప్రజలతో మమేకం కానున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడంపై దృష్టి సారించాలనీ, చట్టబద్ధమైన ఓటర్లు నమోదు సమయంలో బోగస్ పేర్లను తొలగించేలా చూడాలని రేవంత్ రెడ్డి సూచించారు.
మూడు చోట్ల బహిరంగ సభలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మహేశ్వరంతో పాటు పరేడ్ గ్రౌండ్, గచ్చిబౌలి స్టేడియంలో దేవాదాయ భూములను చూపుతూ అనుమతి నిరాకరించారు. బహిరంగ సభలకు భూములిచ్చిన రైతులను అభినందించిన ఆయన తుక్కుగూడలో రైతుల మద్దతుతో 5 లక్షల మందికి పైగా పాల్గొనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ కు అనుమతి నిరాకరించి, బీజేపీకి అనుమతి ఇవ్వడంపై అధికార నేతలపై విమర్శలు గుప్పించారు.