ఎఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ శుక్రవారం నాడు సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొన్నారు. రాహుల్ కు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi శుక్రవారం నాడు సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొన్నారు. రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ Revanth Reddy, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు స్వాగతం పలికారు. రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు వరంగల్ కు బయలు దేరనున్నారు. రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ కు వెళ్లనున్నారు.
రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం సాయంత్రం 5:10కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. 5:45 గంటల వరకు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు. తదుపరి సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 8:00 గంటలకు వరంగల్ నుండి రోడ్ మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో బస చేస్తారు..
శనివారం నాడు మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. 12:50 నుంచి 1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ నేతల సమావేశంలో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ కార్యక్రమం అనంతరం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్ మార్గంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.
వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రధానంగా రైతాంగ సమస్యలను ప్రస్తావించనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రైతులకు మేలు చేసిందనే విషయాలను ప్రస్తావిస్తారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేయనుందనే విషయాలపై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది., వరంగల్ డిక్లరేషన్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.