తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్.. ఆరు గ్యారెంటీలను కూడా ప్రకటించింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్.. ఆరు గ్యారెంటీలను కూడా ప్రకటించింది. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ.. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే కాంగ్రె నాయకులు ప్రజల్లోకి వెళ్తూ పార్టీ హామీలను వారికి వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆరు గ్యారెంటీలపై సోషల్ మీడియా వేదికగా టీ కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తుంది.
ఈ క్రమంలోనే నెటిజన్లను ఆకట్టుకునే విధంగా ఓ వీడియాను తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. గతంలో వరల్డ్ కప్ సమరంలో ఇంగ్లాండ్‌పై భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్రికెట్ అభిమానులు.. వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో ఆ వీడియోను ఉపయోగించి తమ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
Telangana, get ready for some mind-blowing sixers! Congress is here to bat for you with 6 game-changing GUARANTEES. pic.twitter.com/eXsp2WDEGb
— Telangana Congress (@INCTelangana)ఆ వీడియోలో ఇండియా టీమ్‌ను కాంగ్రెస్‌గా, ఇంగ్లాడ్‌ను బీఆర్ఎస్‌గా పేర్కొన్నారు. యువరాజ్ కొట్టిన ఆరు సిక్సర్లకు.. ఆరు గ్యారెంటీలను వీడియోలో చూపించారు. కేటీఆర్ బౌలింగ్ చేస్తుంటే.. కాంగ్రెస్ సిక్స్‌లు కొడుతుందనే అర్థం వచ్చేలా ఆ వీడియోను ఎడిట్ చేశారు. ‘‘తెలంగాణ ప్రజలరా కొన్ని మైండ్ బ్లోయింగ్ సిక్సర్‌లకు సిద్ధంగా ఉండండి! 6 గేమ్-ఛేంజ్ గ్యారెంటీలతో మీ కోసం బ్యాటింగ్ చేయడానికి కాంగ్రెస్ వచ్చింది’’ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పేర్కొంది. ఇక, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత అనే ఆరు ఎన్నికల గ్యారెంటీలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తుక్కుగూడ వేదికగా సెప్టెంబర్ 17న ప్రకటించిన సంగతి తెలిసిందే.