కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు .. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర.. ఎంఐఎం సాయం : కొల్లాపూర్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 31, 2023, 6:59 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని.. వాటికి ఎంఐఎం సహకరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ . తెలంగాణలో బీఆర్ఎస్‌ను, ఢిల్లీలో బీజేపీని ఓడిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని.. వాటికి ఎంఐఎం సహకరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. మంగళవారం కొల్లాపూర్‌లో జరిగిన ‘‘పాలమూరు ప్రజాభేరి ’’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. టికెట్ల కేటాయింపుపై ఢిల్లీలో సీఈసీ సమావేశం వున్నా తాను ఈ సభకు వచ్చానని తెలిపారు. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా తాను ఈ సభకు వచ్చానని.. మనది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కొల్లపూర్ సభకు తప్పక వస్తానని ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికలు ప్రజల తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. 

కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. దొరల ప్రభుత్వంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని రాహుల్ గాంధీ హెచ్చరించారు. కాలేశ్వరంలో లక్ష కోట్లు మింగేశారని.. ఏడాది కూడా కాకుండానే కాళేశ్వరం బ్యారేజ్ బ్రిడ్జీ కుంగిపోతోందని ఆయన చురకలంటించారు. కాంగ్రెస్ కూడా ఎన్నో ప్రాజెక్ట్‌లను నిర్మించిందని.. నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ, సింగూర్, జూరాలను నిర్మించిందని రాహుల్ గుర్తుచేశారు. తాము నిర్మించిన ప్రాజెక్ట్‌లను, బీఆర్ఎస్ నిర్మించిన వాటిని చూడాలని ఆయన పిలుపునిచ్చారు.  

Latest Videos

ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని భూములను లాగేసుకుంటున్నారని.. ధరణితో 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం ఇందిరా గాంధీ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కొన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రెవెన్యూ, ఎక్సైజ, ఇసుక లాంటి శాఖలు కల్వకుంట్ల కుటుంబం దగ్గరే వున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని కల్వకుంట్ల కుటుంబం లూటీ చేస్తోందని.. ఉద్యమం చేసింది ప్రజా తెలంగాణ కోసం , దొరల తెలంగాణ కోసం కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ధరణి వల్ల కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే లాభం జరిగిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ సాకారం చేస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామని రాహుల్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షలు.. రైతులకు ఏడాదికి రూ.15 వేలు, భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్, విద్యా భరోసా కింద రూ.5 లక్షలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు వైద్యం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని.. జీఎస్టీ, వ్యవసాయ చట్టాల సమయంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందని రాహుల్ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని అనుకున్నామన్నారు. విపక్ష నేతలపై ఈడీ, ఐటీ కేసులు వున్నాయని.. కానీ కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో బీఆర్ఎస్‌ను, ఢిల్లీలో బీజేపీని ఓడిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీకి అవసరమైన ప్రతి చోట మజ్లిస్ అండగా నిలిచిందని ఆయన ఆరోపించారు. బీజేపీకి లాభం చేకూరేలా ఎంఐఎం అభ్యర్ధులను నిలబెట్టిందని రాహుల్ ఎద్దేవా చేశారు. విపక్షాలను ఓడించేందుకు ఎంఐఎం కూడా పరోక్షంగా సాయం చేసిందని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించామని రాహుల్ గుర్తుచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. 

click me!