
మెరిట్ అధారంగానే టికెట్లు కేటాయిస్తామని.. ప్రజలతో వుండి పోరాటం చేసే వారికే టికెట్లు (ticket allotment) ఇస్తామని రాహుల్ గాంధీ (rahul gandhi) తేల్చిచెప్పారు. ఆ తర్వాత తనను ఎవరూ తప్పు పట్టొద్దని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు గాంధీ భవన్‌లో పార్టీ సమన్వయకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టికెట్ వస్తుందన్న భ్రమల్లో ఎవరూ వుండొద్దని.. పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం వుంటుందని రాహుల్ స్పష్టం చేశారు.
ఎంత సీనియర్లైనా, ఎంత రాజకీయ చరిత్ర ఉన్నవారికైనా ఇది వర్తిస్తుందని ఆయన హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకుని టికెట్లు ఇస్తామన్నారు. వరంగల్ డిక్లరేషన్ (warangal declaration) రైతులకు, కాంగ్రెస్‌కు (congress) మధ్య నమ్మకం కలిగించేదని రాహుల్ అభిప్రాయపడ్డారు. దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అందరికీ అర్ధమయ్యేలా దానిని వివరించాలని .. వచ్చే నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని రాహుల్ పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ (kcr) కుటుంబమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ (trs), కాంగ్రెస్ మధ్యే పోరాటం వుంటుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ దగ్గర అన్ని శక్తులూ వున్నాయి కానీ.. జన బలం లేదని రాహుల్ దుయ్యబట్టారు. ప్రజాశక్తిని మించింది ఏమీ లేదని.. మన ముందు రెండు మూడు లక్ష్యాలు వున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలల్ని నిజం చేయడం మన లక్ష్యమని.. విద్య, వైద్యం మన ప్రాధాన్యాలని రాహుల్ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలు సాధించాలంటే మన పార్టీలో ఐకమత్యం అవసరమని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.
మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడొద్దని.. ఏదైనా వుంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలని ఆయన హితవు పలికారు. మీడియాకెక్కితే ఉపేక్షించేది లేదని రాహుల్ హెచ్చరించారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే మన లక్ష్యమని.. తెలంగాణ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టే బాధ్యత మనందరిదీ అని రాహుల్ అన్నారు. టీఆర్ఎస్‌పై పోరాడేందుకు కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చామని రాహుల్ గుర్తుచేశారు.