
తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌పై ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ములుగులో తనను ఓడించేందుక బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. తనను ఓడించాలని బీఆర్ఎస్ నేతలు మిడతల దండులాగా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారని మండిపడింది. తాను నిరంతం ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ములుగులో ప్రజా సేవకు, డబ్బు సంచులకు మధ్య యుద్దం జరగబోతుందని అన్నారు.
కష్ణం ఎక్కడుంటే సీతక్క అక్కడుంటుందని.. తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తనను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. తాను ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టించలేదని ఎవరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఏం తప్పు చేశానని తనను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల మధ్యనే ఉండడమే తాను చేస్తున్న తప్పా అని ప్రశ్నించారు.
తాను బాగా పనిచేస్తున్నానని అసెంబ్లీలో పొగుడుతారని.. కానీ ములుగుకు వచ్చి ఓడించమని కోరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు దండయాత్రలు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలే తన కుటుంబమని.. వారే తనను ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తారని అన్నారు.