ఆర్టీసి సమ్మె: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

By narsimha lodeFirst Published Oct 14, 2019, 4:48 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని రేవంత్ విమర్శలు చేశారు. 


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను దోచుకొనేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తానని హమీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల పాటు డ్యూటీకి రాకపోతే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తీసేశారన్నారు. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ ను ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. 

50 వేల మంది కార్మికులు పస్తులుంటే  కేసీఆర్ మాత్రం దసరా సంబరాలు చేసుకొన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రి ఖర్చులను కూడ ప్రభుత్వం భరించలేదన్నారు. 

జీతం రాక ఆర్టీసీ కార్మికుడు సురేందర్ గౌడ్ హౌసింగ్ లోన్ చెక్ బౌన్స్ అయిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్‌ రూ. 2500 కోట్లను కేసీఆర్ దోచుకొన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5 వతేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు కొందరు మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారు.ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు. 

రాణిగంజ్ డిపోకు చెందిన కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెచ్‌సీయూ డిపో డ్రైవర్ సందీప్ కూడ సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.సందీప్ గౌడ్ ను ఆసుపత్రికి తరలించారు.
 

click me!