
నల్లగొండ: కాంగ్రెసు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బొంగులూరు గేట్ వద్ద ఆయనను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పది వేల మంది కార్యకర్తలతో నిరసన కార్యక్రమం చేపట్టడానికి ప్రయత్నించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదు నుంచి మునుగోడుకు బయలుదేరిన రాజగోపాల్ రెడ్డి బొంగులూరు గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని మునుగోడులో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మునుగోడులో ఆయన ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టారు.
బిజెపి నేత ఈటల రాజేందర్ ను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దానికోసం ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.
దళిత బంధు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ నుంచి దళిత నేతలను హైదరాబాదుకు పిలిపించి ప్రగతిభవన్ లో ఆ పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ ఆ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం సాగుతోంది.