
గవర్నర్ పదవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... గవర్నర్ పదవి కంటే సీఎం పోస్టుకే పవర్ ఎక్కువన్నారు. గవర్నర్ పోస్టు నామినేటెడ్ పోస్ట్ అన్న ఆయన.. ఎమ్మెల్సీ, రాజ్యసభ పోస్టులతో గవర్నర్ పదవి సమానమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం టీఆర్ఎస్, గవర్నర్ బీజేపీ కాబట్టే సమస్యలని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతకుముందు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాటల్లో నిరాశ కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు. గురువారం నాడు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ఇంతలా చెబుతున్నా ప్రభుత్వం స్పందించదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పై అమిత్ షాకు నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆయన గవర్నర్ కు సూచించారు.
ఇక తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తమిళిసై సౌందర రాజన్ ఇవాళ రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. స్త్రీల సమస్యలు తగ్గించేందుకు మహిళా దర్బార్ నిర్వహించామని చెప్పారు. 75 మంది మెరిట్ విద్యార్థులకు ఆగస్టు 15న బహుమతులు అందించామని తెలిపారు. ఎన్నో యూనివర్సిటీలు, హాస్టళ్లను సందర్శించానని, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని గవర్నర్ అన్నారు. బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల చూసి చలించిపోయానని తమిళిసై అన్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాశానని ...ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు
ALso REad:రాజ్‌భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా?.. నిద్ర నటించే వాళ్లను ఏం చేయలేం: గవర్నర్ తమిళిసై
వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ క్రాస్ ద్వారా సేవ చేశామని గవర్నర్ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానని.. తనకు గౌరవం ఇవ్వకపోతే తానేమి తక్కువ కానని, తన పనిని తాను కొనసాగిస్తానని తమిళిసై తెలిపారు. సన్మానం జరిగినా జరగకపోయినా తన కృషిలో మార్పు ఉండదని చెప్పారు. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగినా స్పందించలేదని తమిళిసై గుర్తుచేశారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించినట్టుగా చెప్పారు.
తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని అన్నారు. తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవని గవర్నర్ చెప్పారు