ప్రగతి భవన్ ముందు దీక్ష చేస్తాను.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Jan 11, 2022, 7:27 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ప్రగతి భవన్ ముందు దీక్షకు దిగుతానని జగ్గారెడ్డి చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం దీక్ష చేస్తున్నానని తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ప్రగతి భవన్ ముందు దీక్షకు దిగుతానని జగ్గారెడ్డి చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం దీక్ష చేస్తున్నానని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దీక్ష చేస్తానని అన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియా గాంధీదని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ తెచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని గుర్తు చేశారు. తాము ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామంటే ప్రజలు నమ్మలేదని అన్నారు. కేసీఆర్ లక్ష రూపాయలు చేస్తామని చెప్పితే.. రైతులు నమ్మిఒటేశారని అన్నారు. 

కానీ ఇప్పటికి రైతు రుణమాఫీ జరగలేదని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ మాఫీ చేస్తామని చెప్పిన లక్ష రూపాయలకు.. లక్ష వడ్డీ అయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు చాలా తక్కువని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన డిమాండ్‌లే.. మళ్లీ ఇప్పుడు చేయాల్సి వస్తుందన్నారు. ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 

కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడని.. ఆ సంగతి ఏమైందని ప్రశ్నించారు. తాను ఈ నెల 17న ప్రగతి భవన్ ఎదుట దీక్షకు దిగుతానని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే దీక్ష చేస్తున్నానని.. దీన్ని రాజకీయంగా చూడకండని కోరారు. 5 అంశాలపైన నియోజకవర్గ ప్రజల కోసం దీక్ష చేస్తున్నానని చెప్పారు. 

click me!