టీపీసీసీలో చిచ్చు పెట్టిన ‘రెడ్డి’ వ్యాఖ్యలు.. రేవంత్‌పై సొంత పార్టీ నేతల విమర్శలు, ఠాగూర్ సీరియస్

Siva Kodati |  
Published : May 26, 2022, 06:41 PM IST
టీపీసీసీలో చిచ్చు పెట్టిన ‘రెడ్డి’ వ్యాఖ్యలు.. రేవంత్‌పై సొంత పార్టీ నేతల విమర్శలు, ఠాగూర్ సీరియస్

సారాంశం

రెడ్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలకు దిగుతున్నారు. మీడియా సమావేశం పెట్టి క్లారిటీ ఇవ్వాలని సూచిస్తున్నారు. 

టీ.కాంగ్రెస్‌లో మళ్లీ బహిరంగ వ్యాఖ్యల లొల్లి కాకరేపుతోంది. రేవంత్ వ్యాఖ్యలపై బహిరంగ విమర్శలకు దిగారు సొంతపార్టీ నేతలు. రాహుల్ గాంధీ హెచ్చరించినా పట్టించుకోలేదు. రేవంత్ వ్యాఖ్యలపై గాంధీ భవన్ వేదికగా విమర్శలు చేశారు మహేశ్వర్ రెడ్డి. అలాగే రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు మధుయాష్కీ. అటు ఇంటి పోరు రచ్చకెక్కడంపై ఠాగూర్ (manickam tagore) సీరియస్ అయ్యారు. పార్టీ సమస్యలపై మీడియాతో మాట్లాడొద్దన్న రాహుల్ (rahul gandhi) వీడియోను పోస్ట్ చేశారు ఠాగూర్. ఇప్పటికే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు రేవంత్. కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ పార్టీ అని .. పార్టీ సిద్ధాంతాలకు తాను కట్టుబడి వుంటానని ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తెలంగాణలోని సమస్యలపై నేతలు దృష్టి పెట్టాలని రేవంత్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల కోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

అటు రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించారు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి. రేవంత్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం వెలమలు కూడా పనిచేశారని చురకలు వేశారు. కాంగ్రెస్ ఏ కులానికో , వర్గానికో చెందినది కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో వున్న రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలు కావన్నారు. రేవంత్ చేసిన రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. రేవంత్ వ్యాఖ్యలతో అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. దీనిపై మీడియా సమావేశం పెట్టి వివరణ ఇవ్వాలని సూచించారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించాలని ఆయన కోరారు. ఉత్తమ్ పీసీసీగా, సీఎల్పీ నేతగా జానారెడ్డి వుండి కూడా పార్టీ ఓడిపోయిందని మధుయాష్కీ గుర్తుచేశారు. రెడ్ల వలనే పార్టీ నడుస్తుందనడం తప్పుడు అభిప్రాయమని.. వరంగల్ డిక్లరేషన్ తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. సోనియా, రాహుల్‌లు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పారు. వైఎస్ వల్లే యూపీఏ ప్రభుత్వం ఏర్పడిందని రేవంత్ అనడం సరికాదని... వైఎస్- డీఎస్ నాయకత్వంలో 41 ఎంపీ  సీట్లు గెలిచామని గుర్తుచేశారు. వైఎస్ వల్లే సీట్లు గెలిచామని చెప్పడం సోనియా , రాహుల్‌ను అవమానించినట్లేనని చెప్పారు మధుయాష్కీ. 

ALso Read:కాంగ్రెస్ లో రేవంత్ 'రెడ్డి' వ్యాఖ్యల కలకలం: ఏకీభవించవించడం లేదన్న ఏలేటీ

అంతకుముందు రెడ్డి సామాజిక వర్గంపై (reddy community) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజకీయ పార్టీలకు ఆయన సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్నా.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టాలని సూచించారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి.. పతనమయ్యాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రెడ్లకు అవకాశం ఇవ్వండి.. రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తానంటూ సవాల్ విసిరారు. దానికి ఉదాహరణగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని (ys rajasekhara reddy) చూపారు.

రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు… నష్టపోలేదని ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారని.. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు, బలహీన వర్గాలకు దూరం అవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రెడ్లు సీఎం, ప్రధాని.. రాష్ట్రపతిని బీసీ, ఎస్సీ వర్గాలు చేశాయంటే మనమీద వారికి వుండే నమ్మకమే కారణమని రేవంత్ అన్నారు.

వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నామని... రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దని ఆయన సూచించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి.. పద్మనాయకులను దగ్గరికి తీశాడని రేవంత్ గుర్తుచేశారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి..వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. ఆనాటి నుండి.. ఈనాటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు రేవంత్ రెడ్డి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్