గాంధీభవన్‌లో మరో గొడవ .. అనిల్ ఎపిసోడ్ సర్దుమణిగేలోగా, బలరాంనాయక్‌తో మహబూబాబాద్ నేతల వాగ్వాదం

By Siva Kodati  |  First Published Dec 22, 2022, 9:37 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఓ వైపు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నిస్తుండగానే నేతలు ఘర్షణలకు దిగుతున్నారు. మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే అనిల్‌తో ఓయూ నేతలు గొడవ పడ్డారు. ఆ వెంటనే  మాజీ ఎంపీ బల్‌రాంనాయక్‌తో కొందరు ఘర్షణకు దిగారు. 
 


ఓ వైపు గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సమస్యలను పరిష్కరించేందుకు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నిస్తూ వుంటే.. మరోవైపు నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా భరత్ చంద్రా రెడ్డిని నియామకాన్ని తప్పుబడుతూ... మాజీ ఎంపీ బల్‌రాంనాయక్‌తో కొందరు గొడవ పడ్డారు. వీరన్న యాదవ్‌కు డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి.. భరత్‌కు ఎందుకు సహకరించారంటూ బల్‌రాం నాయక్‌ను నేతలు నిలదీశారు. మహబూబాబాద్ మాజీ జెడ్‌పీటీసీ వెంకటేశ్వర్లు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే అక్కడే వున్న నాయకులు వారికి సర్దిచెప్పారు. 

అంతకుముందు గాంధీ భవన్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. ఓయూ నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. అనిల్ కుమార్ క్షమాపణ చెప్పాలని ఓయూ నేతలు డిమాండ్ చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ముందే గల్లాలు పట్టుకున్నారు నేతలు. జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలకు దిగారు. తమకు పదవులు రాలేదని ఓయూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లపై అనిల్ ఎలా ఆరోపణలు చేస్తారని ఓయూ నేతలు ప్రశ్నించారు. సీనియర్ నేత మల్లు రవి ఇరు వర్గాలకు సర్ది చెప్పాలని చూసినప్పటికీ ఇరు వర్గాలు శాంతించలేదు. గాంధీ భవన్‌లో సఖ్యత కోసం దిగ్విజయ్ సింగ్ ప్రయత్నాలు చేస్తుండగా.. బయట నేతలు మాత్రం గొడవపడుతుండటం గమనార్హం. 

Latest Videos

ALso Read: దిగ్విజయ్‌ ముందే గల్లాలు పట్టుకున్న నేతలు.. గాంధీ భవన్‌లో ఉద్రిక్తత

ఇదిలావుండగా... టీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమావేశాలు ముగిశాయి. దాదాపు 8 గంటలుగా ఈ భేటీలు జరిగాయి. దిగ్విజయ్‌తో మాజీ ఎంపీల సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. మీకు అన్ని తెలుసు కాబట్టి .. మీరే ఇన్‌ఛార్జ్‌గా వుండాలని దిగ్విజయ్ సింగ్‌ను కోరారు మాజీ ఎంపీలు. అయితే ఈ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు దిగ్విజయ్. నాకెందుకులెండీ అని కొట్టిపారేశారు . అయితే ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు మాజీ ఎంపీలు. 2014 నుంచి పార్టీలో ఈగో ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతున్నామని వారు దిగ్విజయ్‌కు తెలిపారు. 

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేతలకు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు దిగ్విజయ్. అలాగే గాంధీ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే అనిల్‌తో ఘర్షణకు దిగిన ఓయూ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణా సంఘం. మొత్తం 8 మంది ఓయూ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 
 

click me!