
హైదరాబాద్: నిర్ణీత గడువులో ఎన్నికలు జరిగితే ప్రజలు టీఆర్ఎస్‌కు గుణపాఠం చెబుతారనే ఉద్దేశ్యంతోనే ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సరైన సమయంలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామని టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకొందన్నారు. అందుకే ముందస్తు అంటూ హడావుడి చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఓటరు నమోదు కోసం జనవరి 5 వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఓటరు నమోదు కాకుండానే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఏకకాలంలోనే అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరగాలని బీజేపీ కోరుకొంటుందని చెబుతున్నారని... అలా అయితే తెలంగాణను ఏక కాలంలో ఎన్నికలు జరగకుండా ఎందుకు విడదీస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలు ఎప్పుడూ జరిగినా తాము సిద్దంగానే ఉన్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు అంటే భయమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.