ఆదిలాబాద్‌లో కుక్కర్ల పంపిణీ.. ఈసీ ఆదేశాలతో కాంగ్రెస్ నేతపై పోలీసు కేసు నమోదు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు ఓటర్లను తమవైపుకు ఆకర్షించేందుకు కొందరు నాయకులు ఉచితాలను ఎరగా వేస్తున్నారు.

Congress leader Kandi Srinivas Reddy booked for bribing voters with distributed cookers ksm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు ఓటర్లను తమవైపుకు ఆకర్షించేందుకు కొందరు నాయకులు ఉచితాలను ఎరగా వేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ నాయకుడిపై పోలీసు కేసు నమోదైంది. వివరాలు.. ఆదిలాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన కంది శ్రీనివాస్‌రెడ్డి‌.. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆదిలాబాద్‌లో మహిళా ఓటర్లకు ప్రెషర్‌ కుక్కర్‌ పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఈ క్రమంలోనే ఓటర్లకు లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై కంది శ్రీనివాస్‌రెడ్డిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. తమకు ఫిర్యాదు అందడంతో భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే విచారణకు హాజరుకావాలని కూడా నోటీసులు జారీ చేశారు. ఇక, కంది శ్రీనివాస్‌రెడ్డి ఫౌండేషన్‌ పేరుతో ఆయన కుక్కర్లను స్థానికులకు పంచిపెట్టి ఆయన పార్టీకి ఓట్లు అడిగాడని పోలీసు వర్గాలు తెలిపాయి. 

Latest Videos

ఇక, శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలోని టీటీడీ కల్యాణ మండపంలో కంది శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన ప్రెషర్‌ కుక్కర్‌‌లు పంపిణీ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసిన సంగతి తెలిసిందే. అక్కడికి చేరుకున్న పోలీసులు కుక్కర్లను సీజ్ చేశారు. అయితే కంది శ్రీనివాస్ రెడ్డి కుక్కర్లు పంచిన వ్యవహారాన్ని కొందరు ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతోనే ఈ పరిణామం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే, కంది శ్రీనివాస్ రెడ్డి కొంతకాలం క్రితమే కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలసిందే. అయితే కంది శ్రీనివాస్ చేరికను ఆదిలాబాద్ కాంగ్రెస్‌లోని సీనియర్లు వ్యతిరేకిస్తుున్నారు. మరోవైపు  కంది శ్రీనివాస్ ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే కంది శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని పులువురు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు శనివారం రోజున హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ఎదుట కంది శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడినవారికి మాత్రమే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 

vuukle one pixel image
click me!