
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు.. ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు. దీంతో టీ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పడినట్టేనని భావించారు. విద్యుత్ చార్జీలపై పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిర్వహించిన విద్యుత్ సౌధ ముట్టడిలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో.. నేతలు ఏకతాటిపైకి వచ్చారని ఆ పార్టీ శ్రేణులు అనుకున్నారు. అయితే రెండు రోజులకే కాంగ్రెస్‌లో మరోసారి ఫిర్యాదుల పర్వం మొదలైంది.
ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ అదిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రెడ్డి పై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు.
తుంగతుర్తితో పార్టీకి నష్టం చేసిన డాక్టర్ రవిని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తిని..మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 2018లో పోటీ చేయొద్దని రవికి రాహుల్ చెప్పినప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ ఓటమికి కారణమయ్యారని అద్దంకి దయాకర్ తన లేఖలో పేర్కొన్నారు. అద్దంకి దయాకర్.. సీనియర్ నేతలపై అధిష్టానికి ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.