కేసీఆర్‌తో కాంగ్రెస్ ఢీ: ఇంచార్జీలతో రేపు కీలక సమావేశం

First Published Jun 29, 2018, 12:12 PM IST
Highlights

కాంగ్రెస్ నేతల కీలక సమావేశం


హైదరాబాద్:  ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమౌతోంది. పార్టీ యంత్రాంగాన్ని అన్ని రకాలుగా సిద్దం చేసేందుకుగాను  డీసీసీ అధ్యక్షులు,  అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలు, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జీలతో శనివారం నాడు గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  కుంతియాతో పాటు , ముగ్గురు ఎఐసీసీ కార్యదర్శులు కూడ హజరుకానున్నారు.

ముందస్తు ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 24వ తేదీన సంకేతాలు ఇచ్చారు.దీంతో కాంగ్రెస్ పార్టీ కూడ  ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకొంటుంది. ఈ విషయమై పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం  ఈ నెల 30వతేదిన హైద్రాబాద్‌లో సమావేశం కానుంది.

ముందస్తు  ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్దం చేసే విషయమై పార్టీ నేతలతో చర్చించనున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జీలు, పార్లమెంటరీ ఇంచార్జీలు, డీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నాయకులకు పీసీసీ ఆహ్వానాన్ని పంపింది.

మరోవైపు పార్టీకి సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు వీలుగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు రాష్ట్రస్థాయి నాయకులతో పాటు క్షేత్రస్థాయిలోని గ్రామ, వార్డు స్థాయి నాయకులతో ఒకేసారి మాట్లాడుకొనే యాప్‌ను కూడ ఆ పార్టీ తయారు చేసింది.దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.ఈ యాప్ ద్వారా ఒకేసారి లక్ష మందితో మాట్లాడే అవకాశం లభిస్తోంది.

దీంతో ఈ యాప్ విజయవంతమైతే  రాహుల్ గాంధీ ద్వారా ఆవిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్  ముందస్తు ఎన్నికలకు వెళ్తే తాము కూడ అన్ని రకాలుగా  తయారుగా ఉండాలని పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసేందుకుగాను  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎఐసీసీ నుండి నియామకమైన ముగ్గురు కార్యదర్శులు తమకు కేటాయించిన పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని నేతలతో స్థానిక పరిస్థితులపై ఆరా తీయనున్నారు.  

click me!