తెలంగాణలో పత్తా లేకుండా పోయింది.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ అటాక్

Published : Feb 07, 2022, 07:41 PM ISTUpdated : Feb 07, 2022, 07:47 PM IST
తెలంగాణలో పత్తా లేకుండా పోయింది.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ అటాక్

సారాంశం

పార్లమెంటులో ప్రధాని మోడీ, కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ స్వయంగా మరో వందేళ్లు అధికారంలోకి రావొద్దని నిర్ణయించుకున్నట్టు తోస్తున్నదని అన్నారు. ఎందుకంటే ఆ పార్టీ వ్యవహార శైలి, హామీలు, వ్యూహాలు అన్నీ అలాగే ఉన్నాయని విమర్శించారు. ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనేలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది తామేనని కాంగ్రెస్ చెబుతుంటుంది కదా.. అక్కడి ప్రజలూ వీరిని అంగీకరించలేదని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈ రోజు పార్లమెంటులో మాట్లాడుతూ తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. కాంగ్రెస్‌(Congress)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ తెలంగాణ(Telangana)లో దాని దుస్థితి గురించి మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఒకసారి తిరస్కరించిన రాష్ట్రం మళ్లీ దానికి అధికారమే ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన మంత్రి ఈ రోజు మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహాత్ముడి పేరు మాత్రమే వాడుకుంటుందని, కానీ, ఆ కలలు సాకారం చేసే ఆలోచనలు దానికి లేవని మండిపడ్డారు.

‘అధ్యక్షా.. కాంగ్రెస్ హామీలు, కార్యక్రమాలు, దాని తీర్మానాలు చూస్తుంటే.. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది... కాంగ్రెస్ దానికదిగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు అనిపిస్తుంది. మరో వందేళ్లు అసలు అధికారంలోకి రావద్దనే స్వయంగా భీష్మించుకున్నట్టే కనిపిస్తుంది. ఏదో మూల ఒక ఆశ ఉండాలి కదా. వారికి ఈ ఆశే లేదు. కనీసం ప్రజల్లోనైనా వారి పట్ల ఒక సదభిప్రాయం ఉండేలా మసులుకోవాలి కదా. అదేమీ లేదు. వారికి వారే స్వయంగా వందేళ్లు అధికారం నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు.. మరి నా ఏర్పాట్లు నేనూ చేసుకుంటున్నాను’ అంటూ విమర్శలు చేశారు.

‘అదే సమయంలో ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన వైనాన్ని ఆయన వివరించుకు వచ్చారు. నాగాలాండ్‌లో కాంగ్రెస్‌కు 24 ఏళ్ల క్రితం అధికారం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ అధికారంలోకి రాలేదు. ఒడిశాలో 27 ఏళ్ల క్రితం అధికారాన్ని పొందిందంటే.. మళ్లీ లేదు. 28 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ గోవాలో ఫుల్ మెజార్టీతో గెలిచింది. 1988లో త్రిపురలో  కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిరోహించిందంటే.. ఆ ప్రజలు మళ్లీ దానికి చాన్స్ ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్‌లోనైతే 1972లో అధికారాన్ని చూసిందంటే.. మళ్లీ అధికారాన్ని ఏర్పాటు చేయలేదు. కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఏర్పాటు చేశామని గొప్పలు పోతుంటారు కదా.. ఆ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంకా అంగీకరించనేలేదు’ అంటూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో దాడి చేశారు.

తాము విమర్శకు వ్యతిరేకం కాదని పీఎం మోడీ అన్నారు. సద్విమర్శలను తాము ఆహ్వానిస్తామని, కానీ, కళ్లు మూసుకుని ప్రతి దాన్ని వ్యతిరేకిస్తూ పోతామంటే.. అంగీకరించబోమని తెలిపారు. ఇలాంటి తిరస్కార ధోరణులతో ముందుకు సాగలేమని హితవు పలికారు. కొందరు ఇంకా 2014లోనే ఉండిపోయారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. అప్పటి నుంచి ఎన్నికల్లో ఓడిపోతున్నా.. వారి అహంకారం తగ్గలేదని అన్నారు. 

ఎప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను ముందుకు తేవడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు అసలు ఏ పార్టీకీ చెందరని మోడీ అన్నారు.

మహాత్మా గాంధీ పేరు వాడుకునే వారికి ఆయన కలలు నిజం చేయడంపై ఆసక్తి లేదని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం స్వదేశీ కార్యక్రమాలను వారు ఎందుకు సమర్థించరని, ఎందుకు సహకరించరని నిలదీశారు. నేడు ప్రపంచమంతా యోగాను ఆరాధిస్తుంటే.. వారు దాన్ని అపహాస్యం చేయడానికే పూనుకుంటారని ఆరోపించారు. తాము వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ఇస్తే.. వారు ఎందుకు పట్టించుకోరు అని పేర్కొన్నారు. భారత దేశం ఒక స్వయం సమృద్ధ దేశంగా ఎదగడాన్ని వారు కాంక్షించరనే కదా అర్థం అని అన్నారు. అసలు మహాత్మా గాంధీ కలలు సాకారం చేయాలనే ఆశ, ఆలోచన ఆ పార్టీకి లేదని మండిపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.