'చేయి'చ్చిన ఎమ్మెల్యేలు: ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్

By narsimha lodeFirst Published Mar 11, 2019, 2:17 PM IST
Highlights

రేపు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను  బహిష్కరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు ప్రకటించారు. 

హైదరాబాద్: రేపు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను  బహిష్కరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులను  కేసీఆర్ ప్రోత్సహించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబట్టారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే టీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం ఒక్క స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం తమ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నందున ఆ పార్టీకి టీఆర్ఎస్ మద్దతును ప్రకటించింది.

అయితే తమకు బలం ఉందని కాంగ్రెస్ పార్టీ కూడ గూడురు నారాయణరెడ్డిని బరిలోకి దింపింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కలిసి పోటీ చేశాయి.

కాంగ్రెస్ పార్టీకి 19 , టీడీపీకి రెండు అసెంబ్లీ సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి హ్యాండిచ్చారు.ఆత్రం సక్కు,  రేగా కాంతారావు,చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్‌లు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.
టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడ టీఆర్ఎస్‌లో చేరుతామని స్పష్టం చేశారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు అవసరమైన ఓట్లు లేకుండాపోయాయి. దరిమిలా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.

ఈ విషయాన్ని  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ప్రకటించారు.పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
 

click me!