ఈటల వ్యాఖ్యల కలకలం.. వీహెచ్ కౌంటర్.. రేవంత్ సవాల్ మీద స్పందించని ఈటల..!

By Sumanth KanukulaFirst Published Apr 22, 2023, 11:32 AM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలు తెలంగాణ  రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలు తెలంగాణ  రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే ఇందుకు సాక్ష్యాలు  అయితే తాను అందించలేనని చెప్పారు. కానీ ఇది వాస్తమని అందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఒకే నాణేనికి రెండు ముఖాలనీ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గానీ.. ఆ తర్వాత గానీ రెండు  పార్టీలు చేతులు కలుపుతాయని జోస్యం చెప్పారు. 

అయితే ఈటల రాజేందర్ కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్‌ నుంచి గానీ, కేసీఆర్‌ నుంచి గానీ ఎలాంటి డబ్బులు తీసుకోలేదని అన్నారు. తమ పార్టీ కార్యకర్తల శ్రమను, వారి మద్దతును ఈటల రాజేందర్ అవమానించారని మండిపడ్డారు. రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ చర్చల ప్రమాణాలను దిగజార్చుతున్నాయని విమర్శించారు. 

Latest Videos

తాము ఎటువంటి డబ్బు తీసుకోలేదని  నిరూపించేందుకు చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికీ తాను సిద్ధమేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్ నుంచి తాము డబ్బు తీసుకున్నామని ఈటల కూడా ప్రమాణం చేయాలని అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని ఈటలకు సవాలు విసిరారు. ఈటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకుంటే ఏ దేవాలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. అయితే రేవంత్ సవాలుపై ఈటల రాజేందర్ వైపు నుంచి గానీ, బీజేపీ నేతల నుంచి గానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన వెలువడలేదు.

మరోవైపు ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈటల దగ్గర ఆధారాలుంటే నిరూపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఈటల చెప్పినదానిలో నిజం లేదు కాబట్టే రేవంత్ ప్రమాణం చేస్తానని చెప్పారని తెలిపారు. బీజేపీ వైఫల్యాలను తప్పుదారి పట్టించడంలో భాగంగానే ఆ పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదని విమర్శించారు. ఈటల  రాజేందర్ పచ్చి అబద్దాలు  మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

click me!