కాలేజీకి వెళ్లి మిస్సింగ్... డిండి ప్రాజెక్టులో యువతి మృతదేహం

By telugu teamFirst Published Dec 2, 2019, 7:51 AM IST
Highlights

తండ్రి రోజూ చెన్నాపురం బస్టాప్‌ వద్ద ప్రియంకను దింపుతుండడంతో ఆమె బస్సు, లేదా ఆటోలో కాలేజీకి వెళ్లేది. నవంబర్‌ 25న ఇలా కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. 

కాలేజీకి అని చెప్పి వెళ్లి.. ఓ యువతి కనిపించకుండా పోయింది. తీరా చూస్తే... డిండీ ప్రాజెక్టులో శవమై కనిపించింది. కాగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట అంబగిరి మండలం బల్బూరు గ్రామానికి చెందిన సత్తమ్మ, వెంకటేశ్‌లు కొన్నేళ్ల క్రితం జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వెంకటేశ్వరకాలనీలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెల్లో చిన్నదైన మేగావత్‌ ప్రియాంక(17)లాల్‌బజార్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. 

తండ్రి రోజూ చెన్నాపురం బస్టాప్‌ వద్ద ప్రియంకను దింపుతుండడంతో ఆమె బస్సు, లేదా ఆటోలో కాలేజీకి వెళ్లేది. నవంబర్‌ 25న ఇలా కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. నవంబర్‌ 28 తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.
 
అయితే, నవంబర్‌ 27న ప్రియాంక మృతదేహం డిండి ప్రాజెక్టులో లభించడంతో ఉప్పునూతల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు 28వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే తెలియడంతో సంఘటనా స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు చేశారు. 

పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ఊపిరితిత్తుల్లోకి అధికంగా నీరు చేరడంతో ఆమె మృతి చెందిందని, వంటిపై ఎక్కడా గాయాలు లేవని తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైనా ఆమెను నీళ్లలోకి తోసేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, అక్కడికి ఎలా వెళ్లింది. ఎవరైనా తీసుకెళ్లారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

click me!