
తెలంగాణను (telangana) చలిపులి (cold waves) వణికిస్తోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉత్తర భారతంలో అతిశీతల వాతావరణం, హిమాలయాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావం తెలంగాణపై ఎక్కువగా పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు (imd) చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ (hyderabad) నగరంలోనూ అత్యంత చల్లగా వుంటోంది.
ఆది, సోమ, మంగళవారాల్లోనూ చలితీవ్రత కొనసాగుతుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆర్లి(టీ) గ్రామంలో శనివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో చలికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉదయం 11 గంటలు కావొస్తున్నా చలి తీవ్రత తగ్గడం లేదు.
అటు ఏపీలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకూ సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాలు సహా.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని ఐఎండీ తెలిపింది