నేడు నిజామాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్.. తెలంగాణ యూనివర్సీటీ విద్యార్థి నేతల అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Sep 5, 2022, 9:27 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నిజామాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానానికి చేరుకోనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నిజామాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ఎల్లమ్మగుట్టలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకుంటారు. తొలుత టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డిని సీటులో కూర్చోపెట్టనున్నారు. అక్కడి నుంచి గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణం గులాబీమయంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.  మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేశ్‌ గుప్తాలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నారు. 

సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలైంది.  పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక, సీఎం పర్యటన దృష్ట్యా పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డిచ్‌పల్లి తెలంగాణ వర్సిటీ విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

click me!