
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రేపు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటుగా సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు ఈ ఏరియల్ సర్వేలో పాల్గొనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయో సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. సహాయక చర్యలు ఎలా కొసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
వారం రోజులు పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ.. భద్రాచలం వద్ద మాత్రం గోదావరిలో వదర ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 71.00 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరిలో 24,29,246 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరివాహక ప్రాంతంలోని వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి.