బాగా పనిచేస్తే అవార్డులు.. తేడా వస్తే వేటే: అధికారులకు కేసీఆర్ హెచ్చరికలు

By Siva KodatiFirst Published Sep 3, 2019, 5:21 PM IST
Highlights

30 రోజుల ప్రణాళిక తర్వాత గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని.. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు.. అలసత్వం, అజాగ్రత్త ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు

పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో మండల, జిల్లా స్థాయి అధికారులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ ప్రణాళిక లక్ష్యాలు, ఉద్దేశ్యాలను కేసీఆర్‌ వివరించారు.

పచ్చదనం-పరిశుభ్రతపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. సరిగా పనిచేయని కలెక్టర్లకు వార్షిక ప్రణాళికలో ప్రతికూల మార్కులుంటాయని.. 85 శాతం మొక్కలు బతికి తీరాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

బాధ్యతా రహిత్యం, లక్ష్యాలు చేరుకోని సర్పంచ్‌లపై వేటు తప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 30 రోజుల ప్రణాళిక తర్వాత గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని.. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు.. అలసత్వం, అజాగ్రత్త ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.

కలెక్టర్లతో పాటు మండల స్థాయి అధికారులు ఈ కార్యాచరణలో క్రియాశీలకంగా ఉండాలని.. ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇచ్చి సంరక్షించేలా చూడాలని కావాల్సిన మొక్కల వివరాలు సేకరించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిదేనని సీఎం స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికీ ఓ కృష్ణతులసి మొక్కను తప్పనిసరిగా ఇవ్వాలని.. ఊరి విస్తీర్ణానికి అనుగుణంగా మొక్కలు నాటాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా విజయవంతమవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

click me!