స్వార్దం కోసం తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు.. సమాజాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతోంది: సీఎం కేసీఆర్

By Sumanth KanukulaFirst Published Sep 17, 2022, 11:25 AM IST
Highlights

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి యోధులను తలుచుకోవడం మన కర్తవ్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందరి కృషితోనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిషృతమైందన్నారు. మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు కృషి జరిగిందన్నారు. 

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి యోధులను తలుచుకోవడం మన కర్తవ్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాంపల్లి ప‌బ్లిక్ గార్డెన్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల వేడుక‌ల్లో కేసీఆర్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆనాటి అద్భుత ఘట్టాలు తెలంగాణ ప్రజల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయ‌ని తెలిపారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిచిందన్నారు. అందరి కృషితోనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిషృతమైందన్నారు. మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు కృషి జరిగిందన్నారు. 

హైదరాబాద్ రాష్ట్రంలో పాలన కొనసాగిన కొన్నాళ్ల తర్వాత.. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ పేరిట కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీతో కలిపారు. తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయిన ఏపీతో కలిపారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన్పటి నుంచి తెలంగాణ ప్రజల్లో తాము దోపిడీకి గురవుతున్నామనే భావన ఉండేదని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమంగా బలపడుతూ వచ్చిందన్నారు. అనేక పోరాటలతో తెలంగాన ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకెళ్తుందని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. 

మతతత్వ శక్తులు తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ విద్వేషపు మంటలు రగిలిస్తున్నాయని విమర్శించారు. మనుషుల మధ్య ఈరకమైన విభజన ఏ రకంగానూ సమర్ధనీయం కాదని అన్నారు. మతం చిచ్చు ఈ రకంగానే విజృంభిస్తే.. అది దేశం, రాష్ట్రం జీవికనే కబలిస్తుందన్నారు. మానవ సంబంధాలను మంటగలుపుతుందని.. జాతి జీవనాడిని కలుషితం చేస్తుందన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను సైతం వక్రీకరించి.. వారి స్వార్ధ సంకుచిత ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు విచ్చన్నకరమైన శక్తులు పాల్పడుతున్నాయని ఆరోపించారు. 

ఆనాటి చరిత్రతో, పరిణామాలతో ఎలాంటి సంబంధం లేని ఈ అవకాశవాదులు.. చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజం మరోమారు బుద్దికుశలతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. దుష్టశక్తుల కుటిలయత్నాలను తిప్పికొట్టడ మనందరి కర్తవ్యం అని పేర్కొన్నారు. తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దని అన్నారు. రెప్పపాటు కాలం ఆదమరిచినా విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్నారు. తెలంగాణ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాక్షించారు. జాతి నిర్మాణంలో తెలంగాణ ఉజ్వల పాత్ర పోషించాలని అన్నారు. 

click me!