షార్ట్‌కట్‌లో గెలవాలనుకుంటున్నారు.. వాళ్ల మాటలు నమ్మొద్దు : విపక్షాలపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 27, 2023, 6:28 PM IST

ఓట్ల కోసం వస్తున్న వారికి తెలంగాణపై అవగాహన లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . షార్ట్ కట్ పద్ధతిలో గెలవాలని చూసేవాళ్ల మాటలు నమ్మొద్దని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు .  పదేళ్ల క్రితం రాష్ట్రంలో వ్యవసాయం ఎలా వుంది.. ఇప్పుడెలా వుంది అనేది ఆలోచించాలని సీఎం కోరారు.  


ఓట్ల కోసం వస్తున్న వారికి తెలంగాణపై అవగాహన లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వర్ధన్నపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తుందన్నారు. వర్ధన్నపేటలో రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌పై నేరుగా గెలవలేని వాళ్లే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని.. ల్యాండ్ పూలింగ్ చేయబోమని ముఖ్యమంత్రిగా తాను హామీ ఇస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. 

షార్ట్ కట్ పద్ధతిలో గెలవాలని చూసేవాళ్ల మాటలు నమ్మొద్దని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామని.. దాదాపు రూ.160 కోట్లతో వర్ధన్నపేటను అభివృద్ధి చేశామని కేసీఆర్ వెల్లడించారు. పదేళ్ల క్రితం రాష్ట్రంలో వ్యవసాయం ఎలా వుంది.. ఇప్పుడెలా వుంది అనేది ఆలోచించాలని సీఎం కోరారు. ఆరూరి రమేశ్‌ను తన  కంటే భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Latest Videos

undefined

ALso Read: ఎవరికి ఎవరు అన్యాయం చేశారు: పాలేరులో తుమ్మలకు కేసీఆర్ కౌంటర్

వరంగల్ పట్టణంతో వర్ధన్నపేట కలిసిపోయిందని.. దాదాపు 40 గ్రామాలను వరంగల్‌లో విలీనం చేశామని కేసీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా, ఆర్ధికంగా, ఉద్యోగ కల్పనలో ముందుకు తీసుకుపోతామని.. ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలని కేసీఆర్ కోరారు. అందరూ కలిసి మరోసారి వర్ధన్నపేటలో గులాబీ జెండాను ఎగురవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

click me!